పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్.. కరెక్ట్ కాదు..!
అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 19 Feb 2025 6:09 AM GMTఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాలో టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం మహా కుంభమేళాకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా దంపతులు హాజరై పుణ్య స్నానం చేశారు. ఆ తర్వాత త్రివేణి సంగమానికి హారతులిచ్చారు.
ఆ సమయంలో పవన్ దంపతులతో అకీరా నందన్, త్రివిక్రమ్ కూడా ఉన్నారు. వారిద్దరు కూడా పుణ్యస్నానం ఆచరించారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించినప్పుడు చొక్కా తొలగించి కనిపించారు పవన్.
దీంతో ఆయన ఫిట్ నెస్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కొందరు ఆయన పొట్ట కోసం కామెంట్స్ పెడుతున్నారు. ఫిట్ నెస్ లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజా ప్రతినిధితోపాటు సెలబ్రిటీ అయినప్పటికీ చొక్కా విప్పడానికి వెనుకాడలేదని చెబుతున్నారు.
అనేక ఏళ్లుగా ఆయన ప్రజా సేవలో పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారని అంటున్నారు. సక్రమంగా లేని ఆహార సమయాలు, నిద్ర షెడ్యూల్, ఒత్తిడి.. ఆయన శరీరాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అది అంతా అర్థం చేసుకోవాలని, అంతేగానీ అనవసరమైన చర్చ తగదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ విషయంలో బాడీ షేమింగ్ సరైన పని కాదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం సినిమా నటుడు కాదని, బిజీగా ఉండే రాజకీయ నాయకుడని అన్నారు. ఆయనకు మిగతా హీరోల్లా ఫిట్ నెస్ మెయింటైన్ చేయడానికి తగినంత సమయం లేదని చెబుతున్నారు. కాబట్టి పవన్ విషయంలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేయొద్దని చెబుతున్నారు.
మొత్తానికి పవన్ ఫిట్ నెస్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా గొప్ప విషయమని పవన్ కొనియాడారు. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదని అన్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లడం మహా అద్భుత ఘట్టంగా వర్ణించారు పవన్ కళ్యాణ్.