`ఓజీ` ఫీవర్ పవన్ చెప్పినా వినడం లేదే!
దీంతో `ఓజీ`,` వీరమల్లు` రిలీజ్ ఎప్పుడు అంటూ ఎప్పటికప్పుడు పీకే కనిపించిన ప్రతీ సందర్భంలోనూ అడుగుతూనే ఉన్నారు.
By: Tupaki Desk | 16 Feb 2025 6:44 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్రేక్షకాభిమానుల ముందుకొచ్చి మూడేళ్లు పూర్తయింది. చివరిగా `భీమ్లా నాయక్` సినిమాతో సోలోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత `బ్రో` లో గెస్ట్ రోల్ చేసారు. ఆ తర్వాత మళ్లీ పీకే వెండి తెరపై మెరిసింది లేదు. దీంతో అభిమానుల పవన్ సినిమా ఎప్పుడోస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూసి చూసి వాళ్లు కళ్లు కాయలు కాయడం తప్ప పీకే సినిమా మాత్రం రిలీజ్ అవ్వడం లేదు.
దీంతో `ఓజీ`,` వీరమల్లు` రిలీజ్ ఎప్పుడు అంటూ ఎప్పటికప్పుడు పీకే కనిపించిన ప్రతీ సందర్భంలోనూ అడుగుతూనే ఉన్నారు. వేళ పాళ లేకుండా పవన్ కనిపిస్తే చాలు `ఓజీ.. ఓజీ` అంటూ కేకలేస్తున్నారు. ఎంతలా అంటే చివరికి పవన్ కళ్యాణ్ కూడా చిరాకు పడేంతగా అభిమానులు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాద్దాంతం చేస్తున్నారు. ఆయన కూడ ఓ సందర్భంలో సమయం సందర్భం లేదా? అంటూ నేరుగా అభిమానులపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
అయినా సరే పవన్ ఆవేదనను పట్టించుకోకుండా మరోసారి అలాంటి సన్నివేశానికే తెర తీసారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ కి సంబంధం లేని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ కూడా `ఓజీ` నామ స్మరణ తప్పలేదు. ఆ సమావేశంలో ఓజీ ఓజీ అంటూ అరుపులతో మీటింగ్ కి ప్రాధాన్యత లేకుండా చేసారు. దీంతో `ఓజీ` రిలీజ్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? అన్నది మరోసారి బయట పడింది.
`ఓజీ` కంటే ముందు `హరి హర వీరమల్లు` రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ సినిమా కంటే `ఓజీ` కోసం అభిమానులు ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆ రెండు సినిమాలు కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.