Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్‌' ఈవెంట్‌లో పవన్‌ ఏం మాట్లాడుతారు?

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'గేమ ఛేంజర్‌' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 6:22 AM GMT
గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌లో పవన్‌ ఏం మాట్లాడుతారు?
X

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'గేమ ఛేంజర్‌' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు ఆంధ్రప్రదేశ్‌లోన రాజమండ్రిలో చేయబోతున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్‌ ఉప ముఖ్య మంత్రి హోదాలో హాజరు కాబోతున్న మొదటి సినిమా వేడుక ఇదే కావడంతో అందరి దృష్టి ఈ ఈవెంట్‌పై ఉంది. పవన్‌ ఈ ఈవెంట్‌లో ఏం మాట్లాడుతారు అనేది అందరిని ఆకర్షిస్తోంది.

గతంలో రామ్‌ చరణ్ హీరోగా నటించిన సినిమాల యొక్క ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. అయితే ఈసారి మాత్రం చాలా స్పెషల్‌. ఒక హోదాతో ఈసారి ఆయన సినిమా వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు అత్యంత కీలకంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకుంటారు. కనుక పవన్ కళ్యాణ్ రాజమండ్రి ప్రీ రిలీజ్‌ వేడుకలో ఏం మాట్లాడుతారు అనే విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు. సినిమా గురించే కాకుండా రాజకీయాల గురించి ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.

ఇటీవల తెలంగాణలో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ లో జరిగిన ఘటనపై పవన్‌ ఏమైనా మాట్లాడుతారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మీడియా వారితో మాట్లాడిన సందర్భంలో పవన్‌ కళ్యాణ్ ఆ విషయం గురించి మాట్లాడారు. కనుక మరోసారి గేమ్‌ ఛేంజర్‌ స్టేజ్ మీద ఆ విషయం గురించి మాట్లాడక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే మెగా ఫ్యామిలీలో ఉన్న విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తాడని తెలుస్తోంది. ఇక తన సినిమాలపైనా ఆయన ఒక క్లారిటీ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆయన ఏం మాట్లాడినా అది కచ్చితంగా పెద్ద విషయంగా, పెద్ద చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఏం మాట్లాడుతాడు అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

రామ్‌ చరణ్‌ డ్యూయెల్‌ రోల్‌లో నటించిన గేమ్‌ ఛేంజర్ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించగా, ఆ పాత్రకు జోడీగా అంజలి నటించింది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. సినిమాపై అంచనాలు, ఆసక్తి పెంచిన ట్రైలర్‌కి అత్యధిక వ్యూస్ నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో రూపొందిన గేమ్‌ ఛేంజర్ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సంక్రాంతి విజేతగా ఈ సినిమా నిలుస్తుందా అనేది చూడాలి. ఇదే సంక్రాంతికి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌, వెంకటేష్, అనిల్‌ రావిపూడి కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.