ఓజి vs హరి హర వీరమల్లు: మళ్ళీ లెక్క మారింది!
మొదట హరి హర వీరమల్లుపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఓజి టీజర్, మేకింగ్ వీడియోలు వైరల్ కావడంతో ఓజి మొదటి ప్రాధాన్యతగా మారిపోయింది.
By: Tupaki Desk | 15 Jan 2025 1:30 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి రాబోతున్న డిఫరెంట్ సినిమాల కోసం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఒకటి హరి హర వీరమల్లు, మరొకటి ఓజి. హరి హర వీరమల్లు చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తుండగా, ఇది ఏకకాలంలో అన్ని భాషల్లో విడుదలకానుంది. ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్ల క్రితమే మొదలైనప్పటికీ అనేక కారణాల వల్ల షూటింగ్ పూర్తికాకపోవడం, ఫ్యాన్స్‌లో నిరుత్సాహాన్ని కలిగించింది.
మరోవైపు, ఓజి అనౌన్స్‌మెంట్‌తోనే భారీ హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా పవన్‌ని మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. మొదట హరి హర వీరమల్లుపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఓజి టీజర్, మేకింగ్ వీడియోలు వైరల్ కావడంతో ఓజి మొదటి ప్రాధాన్యతగా మారిపోయింది. ఫ్యాన్స్ నడుమ ఈ మార్పు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ సినిమానే ముందుగా రిలీజ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి.
ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అలాగే దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో కొంత బజ్ తగ్గిన పరిస్థితి కనిపించింది. అయితే హరి హర వీరమల్లు నుంచి విడుదలైన తొలి పాట ''మాట వినాలి'' ప్రోమో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఈ ప్రోమో విడుదలతో హరి హర వీరమల్లుపై మళ్లీ ఆసక్తి పెరిగింది. పవన్ కల్యాణ్ స్వరంతో ఈ పాటలోని డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఫ్యాన్స్ మధ్య ఓ సారి తగ్గిపోయిన హైప్ మళ్లీ పెరగడం విశేషం. ఇదిలా ఉండగా, రెండు సినిమాల హైప్ మధ్య తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఓజికి మోడ్రన్ యాక్షన్, స్టైల్ అనే ప్రత్యేక ఆకర్షణలుండగా, హరి హర వీరమల్లుకు పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, పవన్ మ్యాజికల్ స్వరూపం ప్రధాన బలం. ఈ రెండు సినిమాల మధ్య ఈ వ్యత్యాసం ఫ్యాన్స్‌లో కొత్త చర్చలకు దారితీస్తోంది.
హరి హర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతోంది. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా, పవన్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందని అంచనా. కానీ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది అసలు సందేహం. మరోవైపు, ఓజి కూడా 2025లో భారీ రిజల్ట్‌ను సాధించే అవకాశాలున్నాయి. రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే, పవన్ స్టార్డమ్ మరింత ఎత్తుకు చేరుతుందని ఇండస్ట్రీలో విశ్లేషణ జరుగుతోంది. ఎక్కడ చూసినా పవన్ సినిమాలపై హడావిడి నెలకొంది. హరి హర వీరమల్లు పాట ప్రోమోతో వచ్చిన పాజిటివ్ వైబ్స్ ఈ సినిమా పట్ల ఆశలు పెంచాయి. ఓజితో పాటు హరి హర వీరమల్లు కూడా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుందో వేచి చూడాల్సిందే.