Begin typing your search above and press return to search.

పవన్ బిజీ షెడ్యూల్.. సినిమాల వాయిదా వెనుక మరో కారణం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం అందరికీ తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   5 Feb 2025 5:04 PM GMT
పవన్ బిజీ షెడ్యూల్.. సినిమాల వాయిదా వెనుక మరో కారణం!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం అందరికీ తెలిసిన విషయమే. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్‌బై చెప్పాలని భావించినా, తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అయితే, గతం కంటే ఇప్పుడు సినిమాలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాజకీయ బాధ్యతలు పెరగడం వల్లే ఇలా జరుగుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, కొంత డబ్బు అవసరమైన పరిస్థితుల్లో, పవన్ కొన్ని రీమేక్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

అయితే, కొన్ని ప్రాజెక్టులు కమిట్ అవ్వడం, కొన్ని అడ్వాన్స్ తీసుకోవడం జరిగినా, కొన్ని చిత్రాలు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో నిర్మాతలు కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధానంగా మూడు సినిమాలను కమిట్ అయ్యారు. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు చిత్రాలు కూడా ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు నిరీక్షణలో ఉన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్‌లను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మొదటగా ఆయన హరి హర వీరమల్లు షూటింగ్‌ను పున:ప్రారంభించగా, త్వరలోనే మిగిలిన రెండు సినిమాలకు సంబంధించి కూడా ప్లానింగ్ చేస్తారని సమాచారం. అయితే, హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తవుతుందా? లేదంటే మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహం కొనసాగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.

ఆయన మాట్లాడుతూ, “హరి హర వీరమల్లుకు సంబంధించి పవన్ ఇంకా వారం రోజుల షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. షూటింగ్ త్వరలోనే పూర్తవుతుందని” తెలిపారు. అయితే, మార్చి 28న సినిమా థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని చెప్పారు. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ ఆలస్యమవడంపై ఆనంద్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న చెప్పిన ప్రకారం, పవన్ తన పొలిటికల్ కమిట్మెంట్ల గురించి ముందే నిర్మాతలకు క్లారిటీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ, కొన్ని నిర్మాణ సంస్థలు పవన్ ఇచ్చిన కాల్షీట్లు సరిగ్గా ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో పవన్ ఇచ్చిన డేట్స్ వృథా అయ్యాయని, అందువల్లే చిత్రాలు మరింత ఆలస్యమయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నా, తన సినిమా కమిట్మెంట్లను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే మిగతా రెండు సినిమాల షెడ్యూల్‌ల గురించి అధికారిక సమాచారం వెలువడనుంది. ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాల వేగాన్ని బట్టి, ఈ ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల కానున్నాయని ఆశిస్తున్నారు.