తీన్‌మార్ రీరిలీజ్‌పై బండ్ల గణేష్ క్లారిటీ
ఆ రోజుల్లో ఫ్లాపైన సినిమాలు సైతం ఇప్పుడు మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి.
By: Tupaki Desk | 10 Feb 2025 12:01 PM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ప్రతీ సినిమానూ రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి సినిమాలను ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసి నిర్మాతలు కూడా బాగానే డబ్బులు జేబుల్లో వేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఫ్లాపైన సినిమాలు సైతం ఇప్పుడు మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆయన నటించిన సినిమాల్లో తీన్‌మార్ మూవీ ఎంతో స్పెషల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ ఫ్యాన్స్ కు ఆ సినిమా ఒక ఎమోషన్. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రిలీజైన టైమ్ లో ఓ మోస్తరు ఫలితాన్నే అందుకున్నప్పటికీ అందులో పాటలు, డైలాగ్స్ కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది.
బాలీవుడ్ మూవీ లవ్ ఆజ్ కల్‌కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రీరిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక అభిమాని సినిమాలోని ఓ సీన్ ను పోస్ట్ చేస్తూ లైవ్ డబ్బింగ్ ఎందుకు చెప్పారు? అసలు థియేటర్లో డైలాగులే వినిపించలేదని అన్నాడు. దీంతో ఈ విషయంపై తీన్‌మార్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు.
కొత్తగా డబ్బింగ్ చెప్పించి, మిక్సింగ్ చేసి మళ్లీ సినిమాను రిలీజ్ చేస్తానని బండ్ల గణేష్ ఆ అభిమాని పోస్ట్ కు రిప్లై ఇవ్వడంతో త్వరలోనే తీన్‌మార్ రీరిలీజ్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్ లో ఆ సినిమాకు పని చేసిన ఆర్టిస్టులు మళ్లీ వచ్చి డబ్బింగ్ చెప్పడం, దానికి మిక్సింగ్ అంటే జరిగే పనేనా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కానీ బండ్ల గణేష్ మాత్రం తీన్‌మార్ రీరిలీజ్ పై చాలా కసితో ఉన్నట్టు కనిపిస్తుంది. రీసెంట్ గా ఆ సినిమా గురించి మాట్లాడుతూ తీన్ మార్ గుండెలకు హత్తుకునే సినిమా అని, అందరికీ ఆ సినిమా నచ్చుతుందని, రిలీజ్ ముందు వరకు కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నానని, ఆ సినిమా ఎందుకు ఆడలేదనేది తనకు ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నేనని, తీన్‌మార్‌ను అద్భుతంగా మార్చి మళ్లీ రీరిలీజ్ చేస్తానని గణేష్ అన్నాడు. దీంతో తీన్‌మార్ ఎప్పుడెప్పుడు రీరిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూడటం మొదలుపెట్టారు.