వీరమల్లు కోసం మళ్లీ పవన్ కళ్యాణ్...!
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 11 నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు.
By: Tupaki Desk | 10 Dec 2024 11:15 AM GMTపవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తూ ఉన్నారు. సడెన్ విజిట్, అధికారిక టూర్‌లు, ఢిల్లీ పర్యటనలు ఇలా ఎన్నో పనులతో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలోనూ ఆయన ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలకు సమయం దొరికినప్పుడు డేట్లు ఇస్తూ ఆ రెండు సినిమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మరోసారి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కి హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 11 నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. కనుక వచ్చే షెడ్యూల్‌తో మొత్తం షూటింగ్ పూర్తి చేసే విధంగా దర్శకుడు జ్యోతి కృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను క్రిష్ మొదలు పెట్టినా చాలా ఆలస్యం అవుతున్న కారణంగా తప్పని పరిస్థితుల్లో సినిమాను వదిలి ఆయన మరో సినిమాను మొదలు పెట్టుకున్నాడు. దాంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారనే విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొందరు ఈ సినిమా విషయమై నెగటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే కొందరు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ని చూడని పాత్రలో చూడబోతున్నందుకు ఆసక్తిగా ఉన్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని, గొప్ప నటుడు, ఆయన సింపుల్ అండ్ స్వీట్ పర్సన్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి అభిప్రాయం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వీరమల్లు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి పాట త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక గజ దొంగ పాత్రలో పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది.