దేశం ఇటు చూస్తోందంటే డైరెక్టర్ శంకర్ వల్లే: పవన్ కల్యాణ్
ముఖ్యంగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ పై ప్రశంసలు కురిపించారు.
By: Tupaki Desk | 4 Jan 2025 3:51 PM GMTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం రాజమండ్రిలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై రామ్ చరణ్ ప్రతిభను, హార్డ్ వర్కింగ్ నేచుర్ ని పవన్ కల్యాణ్ ఆకాశానికెత్తారు. ముఖ్యంగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ పై ప్రశంసలు కురిపించారు. ప్రీరిలీజ్ వేదికపై పవన్ స్పీచ్ ఇలా సాగింది.
దక్షిణాదిన అత్యంత ప్రతిభావంతుడైన, కీలక దర్శకుడు శంకర్ .. భారతదేశం మొత్తం తెలుగు చిత్రసీమ వైపు చూస్తోంది అంటే.. తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన శంకర్ సినిమాల వల్లనే.. అతడి సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. అంత గొప్ప సినిమాలు తీసారు శంకర్ గారు. ఆయన తెలుగు సినిమాలు చేయొచ్చు కదా అనుకునేవాడిని. ఇలాంటి సమయంలో ఆయన గేమ్ ఛేంజర్ ని తెలుగులో తీసి మిగిలిన భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... అని అన్నారు.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా బాగా ఆడుతుంది. ప్రత్యేకించి ఇంత అద్బుతమైన సినిమా తీసిన దర్శకుడు శంకర్ గారికి అభినందనలు... అని పవన్ విషెస్ తెలిపారు.
జనసేనకు ఇంధనం నింపిన దిల్ రాజు:
గేమ్ ఛేంజర్ వేడుకలో నిర్మాత దిల్ రాజును పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నా 'తొలి ప్రేమ' రిలీజైన సమయంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్. ఒక పోస్టర్ చూసి.. ఎవరో చెప్పిన మంచి మాట విని తొలి ప్రేమ పంపిణీ హక్కులు తీసుకున్నారు. దానికి అడ్వాన్స్ ఇచ్చారు. నిర్మాతగా ఎదిగాక నాతో 'వకీల్ సాబ్' సినిమాని నిర్మించారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు నాతో వకీల్ సాబ్ తీసారు.. నా దగ్గర డబ్బుల్లేవ్.. పేరుంది.. మార్కెట్ ఉందో లేదో తెలీదు. అలాంటి సమయంలో 'వకీల్ సాబ్' సినిమా నాతో నిర్మించారు. జనసేన పార్టీ నడపడానికి ఇంధనం అందించారు.. అని పవన్ గుర్తు చేసుకున్నారు.