పవన్ కల్యాణ్‌కి ఆ పేరు పెట్టిన గురువు ఇతడు!
తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ ఇచ్చిన హుస్సేనితో తనకున్న అనుబంధాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
By: Tupaki Desk | 25 March 2025 8:24 PM ISTకరాటే శిక్షకుడు - గురువు 60 ఏళ్ల షిహాన్ హుస్సేని మరణ వార్త విని పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ ఇచ్చిన హుస్సేనితో తనకున్న అనుబంధాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హుస్సేని అనారోగ్యం గురించి నాలుగు రోజుల క్రితం తెలుసుకున్నానని, ఈ నెల 29న చెన్నైలో ఆయనను కలవాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
షిహాన్ హుస్సేని మరణించారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆయన నాకు కఠినమైన నియమాలతో కరాటే నేర్పించారు. ఆయన చెప్పిన ప్రతిదానికీ నేను కట్టుబడి ఉన్నాను. మొదట్లో ఆయన నాకు నేర్పించడానికి సంకోచించారు. ప్రస్తుతం విద్యార్థులను తీసుకోవడం లేదని అన్నారు.. కానీ చాలాసార్లు వేడుకున్న తర్వాత ఆయన అంగీకరించారు. నేను ఉదయాన్నే సెషన్లకు హాజరవుతాను.. సాయంత్రం వరకు ఉంటాను. 'తమ్ముడు' చిత్రంలో నా పాత్రకు ఈ శిక్షణ అమూల్యమైనదని నిరూపితమైంది`` అని పవన్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
''హుస్సేని సుమారు 3,000 మందికి కరాటేలో శిక్షణ ఇచ్చిన ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ గురువు. తమిళనాడులో విలువిద్యను ప్రోత్సహించడంలో, రాష్ట్ర విలువిద్య సంఘంలో కీలక పదవులను నిర్వహించడంలో అతడి పాత్ర అమోఘమైనది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా అతడికి పేరుంది. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతోను ఆయన పాపులరయ్యారు. మరణం తర్వాత తన శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేయాలనే నిర్ణయం ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సవాలుతో కూడిన సమయంలో షిహాన్ హుస్సేని కుటుంబానికి కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పవన్ నా ఫేవరెట్ స్టూడెంట్:
ఓ వీడియోలో పవన్ కి తాను కరాటే శిక్షణ ఇచ్చానని, కళ్యాణ్ కుమార్ అని అతడిని పిలుస్తుంటే, తాను పవన్ కల్యాణ్ అనే పేరును పెట్టానని కూడా హుస్సేనీ అన్నారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి రెగ్యులర్ గా వచ్చేవాడని, అతడు చురుగ్గా ఉండేవాడని తన ఫేవరెట్ స్టూడెంట్ అని కూడా హుస్సేని అన్నారు.