Begin typing your search above and press return to search.

OG ఓకే.. మరి వాటి సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంత్రిగా పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 July 2024 7:30 AM GMT
OG ఓకే.. మరి వాటి సంగతేంటి?
X

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంత్రిగా పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. ఏపీ రాజకీయాలలో అతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తెలియజేశారు. అయితే సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పరిపాలన వ్యవహారాలలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వలన మరో మూడు నెలల వరకు సినిమా షూటింగ్ లకి సమయం కేటాయించే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి అయితే రాలేదు. ప్రస్తుతం అతను కమిట్ అయిన సినిమాలు మూడు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉండడం విశేషం. ఈ సినిమాలను కచ్చితంగా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాల షూటింగ్ ల కోసం ఎక్కువ సమయం తీసుకుంటే నిర్మాతలకు భారం అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండేళ్లలోనే మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ ఆల్ మోస్ట్ చివరి దశలో ఉన్నాయి. వీటిలో ఏది ముందు కంప్లీట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ముందుగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ కంప్లీట్ చేసే అవకాశం ఉందంట. ఈ సినిమాని కచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత దానయ్యకు పవన్ కళ్యాణ్ చెప్పారంట.

ఈ నేపథ్యంలో పవన్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు షూటింగ్ చేయడానికి డైరెక్టర్ సుజిత్ ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారంట. ఈ సినిమా కోసం 25 రోజుల డేట్స్ పవన్ కళ్యాణ్ ఇస్తే మూవీ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో మెజారిటీ పార్ట్ ని సుజిత్ ఫినిష్ చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీక్వెన్స్ పెండింగ్ లో ఉన్నాయనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఓజీ మూవీ కోసం కాల్ షీట్స్ కేటాయించే అవకాశం ఉందని టాక్.

ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మిగిలిన రెండు సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 నుంచి 30 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని నిర్మాత ఏఎం రత్నం గతంలో చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాదిలో చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ఓజీ కంప్లీట్ అయ్యాక తన రాజకీయ కార్యకలాపాలు చూసుకొని వీలును బట్టి హరిహర వీరమల్లుకి డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.