పవన్ ఆశలన్నీ ఆ సీటు మీదేనా...?
ఇందులో జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు ఎన్ని అన్న చర్చ ఇపుడు వస్తోంది. అయితే తెలంగాణాలో హోరా హోరీ పోరు సాగుతోంది
By: Tupaki Desk | 28 Nov 2023 2:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికల బరిలోకి తొలిసారి దిగారు. ఆయన పార్టీ పెట్టాక పోటీ చేసింది 2023 ఎన్నికల్లోనే అన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తెలంగాణా గడ్డ మీద 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ తన పార్టీని ప్రారంభించారు. కానీ ఆ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. 2018 నాటికి కూడా ఆయన సంసిద్ధులు కాలేదు.
ఇక 2023 నాటికైనా పోటీ చేసి తీరాల్సిందే అని జనసేన తెలంగాణా నాయకుల నుంచి వత్తిడి వచ్చిన మీదట పవన్ కళ్యాణ్ సొంతంగానే 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లలో పోటీకి దిగారు.
ఇందులో జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు ఎన్ని అన్న చర్చ ఇపుడు వస్తోంది. అయితే తెలంగాణాలో హోరా హోరీ పోరు సాగుతోంది. అయితే బీయారెస్ లేకపోతే కాంగ్రెస్ అన్నట్లుగా పొలిటికల్ గా పోలరైజ్ అవుతున్న సన్నివేశం కనిపిస్తోంది. బీజేపీ అధికారం కోసమే టార్గెట్ చేస్తే చివరికి ఆ పార్టీకి మూడు నుంచి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తూ పలు ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వచ్చిన బీజేపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే అసలు తెలంగాణాలో జనసేన పార్టీని ఏ మాత్రం పటిష్టం చేయకుండా సడెన్ గా బరిలోకి దిగిన జనసేన కి ఎలాంటి అవకాశాలు ఈ ఎన్నికల్లో ఉంటాయన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.
అయితే జనసేనకు ఎపుడూ పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, ఆయన వెనక ఉన్న బలమైన సామాజికవర్గం అండగా ఉంటాయని అంటున్నారు. అవి ఎంతమేరకు వర్కౌట్ అవుతాయన్నది ఈ ఎనిమిది సీట్ల విషయంలో ఈసారి ఎన్నికల్లో తేలనుంది అని అంటున్నారు. జనసేనకు నిజానికి ఎంతో కొంత చాన్స్ ఉండేందుకు అవకాశం ఉండేది. అది ఎపుడు అంటే తెలుగుదేశం పోటీలో లేకపోవడం. ఆ పార్టీ మద్దతు కనుక దక్కితే జనసేనకు మంచి బలమే సమకూరుతుంది అని అంటున్నారు.
కానీ టీడీపీ మాత్రం ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తూ వస్తోంది. దాంతో ఏపీలో జనసేన పొత్తుని తెలంగాణాలో కొనసాగించడంలేదని అర్ధం అవుతోంది. బీజేపీ పొత్తు వల్ల జనసేనకు ఎంత వరకూ ప్లస్ అంటే అది కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకునేలా లేదు అంటున్నారు. సో ఎలా తీసుకున్నా జనసేనకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షంగానే ఉన్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఎనిమిది సీట్లలో పోటీ చేస్తున్నా పవన్ ఆశలు అన్నీ ఆ సీటు మీదనే ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం కాస్తా ఆలస్యంగా ప్రారంభించినా కూడా కూకట్ పల్లిలో మాత్రం ఎక్కువ సార్లు చేశారు. ఇక ప్రచారం ముగుస్తున్న చివరి రోజు అయిన మంగళవారం కూడా ఆయన కూకట్ పల్లిలోనే రోడ్ షో చేపట్టారు.
అంటే ఈ సీటు మీదనే గట్టి ఆశలు పెంచుకున్నారా అన్న చర్చ మొదలైంది. దానికి కారణం ఉంది. ఇక్కడ ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ జనసేన అభ్యర్ధిగా ప్రేమ్ కుమార్ పోటీలో ఉన్నారు. ఆయన బీజేపీలో ఉంటూ జనసేనలోకి వచ్చిన నేతగా ఉన్నారు. ఆయన కమ్మ సామాజికవర్గం నేత.
ఇక టీడీపీ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు కమ్మ వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇదే అంటున్నారు. మరి ఆ ఓట్లు కనుక జనసేనకు టర్న్ అయితే కచ్చితంగా ఈ సీటు ఆ పార్టీ పరం అవుతుంది అని లెక్కలేస్తున్నారు. అదే సమయంలో బీయారెస్ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణా రావు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు.
అందువల్ల టీడీపీ ఓట్లు ఎటు వైపు మళ్ళుతాయి అన్న దాని మీదనే ఈ నియోజకవర్గంలో గెలుపు ఆధారపడి ఉంది అంటున్నారు. ధర్మంగా అయితే జనసేనకు టీడీపీ ఓట్లు పడాలి. ఏపీలో జనసేన సపోర్ట్ టీడీపీకి ఉంది కాబట్టి అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా ఈ సీటులో ప్రచారం చేయడం వల్ల ఆయన ఆశలు అన్నీ ఇక్కడే పెట్టారు అని అంటున్నారు. సో కూకట్ పల్లి ఇపుడు జనసేనకి పొలిటికల్ గా టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అన్నది కొద్ది రోజులలోనే తేలనుంది అంటున్నారు.