Begin typing your search above and press return to search.

నేను రాజ‌కీయాల్లోకి రావ‌డం త్రివిక్ర‌మ్‌కి ఇష్టం లేదు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రాజ‌కీయాల్లోకి రావ‌డం కుటుంబ స‌భ్యుల‌కు ఇష్టం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో అన్నారు.

By:  Tupaki Desk   |   15 March 2024 4:48 AM GMT
నేను రాజ‌కీయాల్లోకి రావ‌డం త్రివిక్ర‌మ్‌కి ఇష్టం లేదు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
X

రాజ‌కీయాల్లోకి రావ‌డం కుటుంబ స‌భ్యుల‌కు ఇష్టం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో అన్నారు. తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కి కూడా ఇష్టం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా స‌మావేశంలో వ్యాఖ్యానించారు. తాను క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు పార్టీని న‌డ‌ప‌లేక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు త‌న‌కు త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ అండ‌గా నిలిచాడ‌ని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.

త‌న‌ను రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కుండా ఆపేందుకు త్రివిక్ర‌మ్ శ‌త‌థా ప్ర‌య‌త్నించాడ‌ని, త‌న‌లోని ఆవేశాన్ని నిలువ‌రించేందుకు సీన్లు కూడా రాసాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీని గెలిపించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. దీనికోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు జ‌న‌సేన‌కు క‌లిసొస్తుంద‌ని కూడా భావిస్తున్నారు. అధికార వైకాను ఓడించ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్నారు. అదే క్ర‌మంలో ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌సంగాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

అయితే త‌న స‌భ‌ల‌కు వ‌చ్చే ల‌క్ష‌లాది జ‌నం ఓట్లు వేయ‌ర‌ని అది త‌న‌కు కూడా తెలుసున‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. గ‌త ఎన్నిక‌ల్లో తాను ఓట‌మి చెందుతాన‌ని తెలిసి కూడా పోరాడాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఏపీ రాజ‌కీయాల కోసం తాను అన్నిటినీ వ‌దులుకున్నాన‌ని, డ‌బ్బు లేక‌పోయినా, ఒత్తిళ్లు ఉన్నా కానీ ఎదురొడ్డి పోరాడాన‌ని అన్నారు. దేశం కోసం పిచ్చి త‌న‌ను న‌డిపిస్తుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. త‌న‌కు క‌ష్ట కాలంలో అన్ని ర‌కాలుగా త్రివిక్ర‌మ్ అండ‌గా నిలిచార‌ని త‌న స్నేహ‌ధ‌ర్మం ఎంతో గొప్ప‌ద‌ని వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముళ్ల బాట‌లో అయినా తాను ముందుకు న‌డుస్తూనే ఉంటాన‌ని అన్నారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప‌వ‌న్ పైవిధంగా వ్యాఖ్యానించారు.