పవన్ కళ్యాణ్ మకాం ఇప్పుడెక్కడ?
జనసేన అధినతే పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో పిఠాపురం నియోజక వర్గం ప్రజలు 70వేల వోట్ల భారీ మోజార్టీతో గెలిపించారు
By: Tupaki Desk | 10 Jun 2024 9:30 AM GMTజనసేన అధినతే పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో పిఠాపురం నియోజక వర్గం ప్రజలు 70వేల వోట్ల భారీ మోజార్టీతో గెలిపించారు. ఇప్పుడా నియోజక వర్గం అభివృద్ధి పవన్ పై ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభివృద్ది చేసి చూపిస్తానని ప్రామిస్ చేసారు. ఈ మాట ఒక్కసారి కాదు...చాలా బలంగా నొక్కి వొక్కాణించి మరీ చెప్పారు. ఆయన తరుపున వచ్చి ప్రచారం చేసిన వారు కూడా ఇదే మాట చెప్పి జనాల్లోకి వెళ్లారు.
ఈ మాటల్ని నియోజక వర్గం ప్రజలు అంతే బలంగా నమ్మారు కాబట్టి ఓట్లు వేసారు. అలాగే పిఠాపురంలో ఇకపై ఉంటానని...హైదరాబాద్ లో ఉండనని..నిత్యం అక్కడ ప్రజల సేవకై అంకితమవుతానన్నారు. అన్నట్లుగానే ప్రచార సమయంలోనే నియోజక వర్గంలో ఓ ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే పవన్ ఇప్పుడు నిజంగా నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం అన్నది ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి.
ఎందుకంటే ఆయన ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా పూర్తిచేయాలి. ఇప్పటికిప్పుడు ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు రెడీగా ఉన్నాయి. `ఓజీ`, `హరి హరహర వీరమల్లు`, `ఉస్తాద్ భగంత్ సింగ్` చిత్రాలు ఉన్న పళంగా పూర్తి చేసి నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇప్పటికే పవన్ రాక కోసం ఆ దర్శక-నిర్మాతలంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఎప్పుడు వస్తాడు? మా సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు? అని ఎంతో ఎదురు చూస్తున్నారు.
కేంద్రలో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది గానీ ఆ ఛాన్స్ లేదని నిన్నటితో తేలిపోయింది. ఆ పదువులు మరో ఇద్దరికి వెళ్లడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గేమ్ ఛేంజర్ కి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? అన్నది చూడాలి. ఇలా పవన్ కళ్యాణ్ రెండు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే పవన్ పిఠాపురం టూ హైదరాబాద్ కూడా తరుచు తిరగాల్సి ఉంటుంది. మరి ఈ రెండింటిని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అన్నది చూడాలి.