పవన్ నోట సినిమా నటుల పేర్లు అవసరమా?
ఈ క్రమంలోనే ఎన్టీఆర్-కృష్ణని టచ్ చేయడంతో పనవ్ పై మహేష్ అభిమానులు ఒక్కసారిగా నెట్టింట భగ్గుమన్నారు.
By: Tupaki Desk | 22 April 2024 7:37 AM GMTఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడు కూటమి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ వ్యాఖ్యల్లో భాగంగా సీనియర్ ఎన్టీఆర్-సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఉన్న విబేధాన్ని టచ్ చేసారు. ఎన్టీఆర్ ని.. కృష్ణ విబేధించినా..ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నా కృష్ణ సినిమాల్ని ఎప్పుడూ ఎన్టీఆర్ ఆపలేదని..సీఎం జగన్ -పవన్ మధ్య ఉన్న వైరాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-కృష్ణని టచ్ చేయడంతో పనవ్ పై మహేష్ అభిమానులు ఒక్కసారిగా నెట్టింట భగ్గుమన్నారు.
కృష్ణ..మహేష్ అభిమానులు పవన్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన వారు కొందరైతే ఆయన వ్యాఖ్యల్ని అర్దం చేసుకుని సమర్దించిన వారు మరికొందరు. ఒకసారి ఎన్టీఆర్-కృష్ణ వివాదంలోకి వెళ్తే...1983 లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ విధానాలు నచ్చక కృష్ణ కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కృష్ణ ..ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలు తెరపైకి వచ్చాయి. గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి, నా పిలుపే ప్రభంజనం వంటి సినిమాలు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాయనే వాదనలున్నాయి.
మండలాధీశుడులో ఎన్టీఆర్ పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు చేయడం తో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఓ సందర్భంలో విజయనిర్మల ఎదురు పడినప్పుడు ఎన్టీఆర్ గారే నేరుగా నా మీద సినిమాలు ఆపలేదా? అంటూ అడిగారుట. ప్రతీగా ఆవిడ కూడా అవి మీమీద తీసిన సినమాలు కాదని బధులిచ్చినట్లు పాత జర్నలిస్ట్ లు చెబుతుంటారు. అయితే ఇప్పుడు జరుగుతోన్న పవన్ -జగన్ మధ్య వైరాన్ని కూడా అలాగే చూడాలా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అప్పుడు రాజకీయాలు వేరు..ఇప్పటి రాజకీయాలు వేరు. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి అభిమానులు వేరు ఇప్పటి అభిమానులు. పవన్ అప్పటి వ్యత్యాసాన్ని ..ఇప్పటి వ్యత్సాన్ని ముడి పెట్టి మాట్లాడటం లో అర్దం లేదని ఖండిచిన వారు లేకపోలేదు. అలాగని పవన్ వర్గాన్ని వ్యతిరేకించినట్లు కాదు. సమర్ధించినట్లు కాదు. సినిమా అనేది ఎంతో సెన్సిటివ్ అంశం. రాజకీయం అనేది వేరు కోణంలో చూడాల్సిన అంశం. ఆ రెండింటిని కలిపి చూడటం సబబు కాదన్నది మేధావుల మాట.
చాలా సందర్భంలో రెండిటిని కలిపి చూడొద్దని సినిమా పెద్దలు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి..బాలకృష్ణ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఉద్ఘాటించారు. రాజకీయ ప్రసాంగాల్లో వీలైనంత వరకూ సినిమా నటుల పేర్లు తెరపైకి తేవకపోవడం ఎంతో ఉత్తమమైన పని. కానీ పవన్ ఒక్కడే చీటికి మాటికి ఎన్టీఆర్.. మహేష్.. ప్రభాస్.. బన్నీ.. చరణ్ పేర్లను పొలిటికల్ ప్రచారంలో భాగంగా ప్రస్తావిస్తోన్న వైనం తెలిసిందే. అలాగని ఆ హీరోల్ని గానీ..అభిమానుల్ని గానీ పవన్ నెగిటివ్ గా ఉద్దేశించడం లేదు. ఇండస్ట్రీలో తామంతా ఒక్కటిగా ఉండి పనిచేస్తామని..అందరి అభిమానులు తనకు సమానమేనని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే పవన్ స్థాయిని సైతం తగ్గించుకుని మిగతా హీరోల్ని హైలైట్ చేయడం పవన్ గొప్పతనం.
పవన్ కోణంలో ఇది రాజకీయం కాకపోయినా రాజకీయ సభల్లో హీరోల్ని-అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడటం పై పవన్ పై కాస్త నెగిటివిటీ కనిపిస్తోంది. ఆయన రాజకీయం ఆయన చేసుకునే దానికి సినిమా నటుల పేర్లు తెరపైకి తేవడం అంత శ్రేయస్కరం కాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.