డిజైనర్ రాంగ్ మెసేజ్.. సెట్లో ఏడ్చేసిన నటి
ఏదో ఒక మిస్ కమ్యూనికేషన్ కొన్నిసార్లు వ్యక్తుల మధ్య దూరం పెంచుతుంది.
By: Tupaki Desk | 2 March 2025 9:22 AM ISTవినోద ప్రపంచంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాగ్రానికి చేరడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. దానికి మించి మానవ ప్రపంచంతో గొప్ప సత్సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే చిక్కంతా ఇక్కడే. ఎంత పెద్ద స్టార్ అయినా కానీ, సెట్లో కొందరికి కనెక్టవ్వడం అంత సులువుగా కుదరదు. ఏదో ఒక మిస్ కమ్యూనికేషన్ కొన్నిసార్లు వ్యక్తుల మధ్య దూరం పెంచుతుంది.
అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ప్రియాంక చోప్రా మధ్య పెను సమస్యను సృష్టించినట్టు గమనించానని ప్రియాంక తల్లి మధు చోప్రా అన్నారు. ''దోస్తానా'' షూటింగ్ జరుగుతున్న సమయంలో తన కుమార్తె సెట్లో కళ్లనీళ్ల పర్యంతమైందని, దానికి మనీష్ మల్హోత్రా కారకుడు అని మధూ తెలిపారు. దోస్తానా కోసం 'దేశీ గర్ల్' పాటను చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. చిత్రనిర్మాత కరణ్ జోహార్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు ఒక ఎస్.ఎం.ఎస్ పంపారు. వెంటనే మనీష్ మల్హోత్రా రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఆ రిప్లై పొరపాటున ప్రియాంక చోప్రా ఫోన్ కి వచ్చింది. అందులో సందేశం చదివాక ప్రియాంక చోప్రా చాలా బాధపడింది. కన్నీటిపర్యంతమైంది.
పాట చిత్రీకరణ సమయంలో ప్రియాంక సెట్‌లో కుప్పకూలిపోయిందని తెలుసుకుని షాక్ అయ్యానని మధు చోప్రా గుర్తు చేసుకున్నారు. మనీష్ అనుకోకుండా ఆమెకు సందేశం పంపాడు.. ప్రియాంక చోప్రాతో పని చేయడం అతడికి ఇష్టం లేదని ఆ మెసేజ్ చూశాక అర్థమైందని మధు అన్నారు.
అయితే కరణ్ జోహార్ కి మనీష్ పంపాలనుకున్న మెసేజ్ లో ఏం ఉంది? అంటే.. కరణ్ మెసేజ్ లో ఏం ఉందో తెలియాలి. నిర్మాత కరణ్ జోహార్ మనీష్‌ను సెట్‌కి రమ్మని మెసేజ్ చేశాడు. మనీష్‌కు 'ఫిల్మ్ సిటీ ఆ జావో' అని మెసేజ్ చేశాడు. ''ఫిల్మ్ సిటీకి రండి. ఇది చివరి రోజు. మీరు ఆమెను వదిలించుకుంటారు'' అని కరణ్ సందేశం పంపాడు. వెంటనే ''థాంక్ గాడ్.. ఇట్స్ మై లాస్ట్ డే.. ప్రియాంక'' అని మనీష్ కూడా కరణ్ కి రిప్లై పంపాడు. కానీ కరణ్ కు మెసేజ్ పంపే బదులు ప్రియాంకకు దానిని పంపాడు. ఆ మెసేజ్ చూసి పీసీ ఆశ్చర్యపోయింది. వెంటనే బాధను తట్టుకోలేక ఏడ్చేసింది. అనుకోకుండా రాంగ్ పర్సన్ కి మెసేజ్ పంపానని మనీష్ గ్రహించాడు.
ఆ తర్వాత మీకు 'నచ్చని పని నేను ఏం చేసాను?' అని ప్రియాంక చోప్రా నేరుగా మనీష్ మల్హోత్రాను అడిగింది. ఒక అనుభవజ్ఞురాలైన జర్నలిస్ట్ లా ఆ ఘటన అనంతర పరిస్థితులను పీసీ తెలివిగా మ్యానేజ్ చేసిందని మధు చోప్రా పేర్కొంది. ఆ తర్వాత ఎప్పటికీ శత్రువులుగా మారకుండా.. ఆ ఇద్దరూ అత్యంత సన్నిహితులు అయ్యారు. ప్రియాంక షూటింగ్‌లో ఉన్నప్పుడు మనీష్ తనను సందర్శించాడని మధు చోప్రా తెలిపింది. అలాగే ప్రియాంక చోప్రాకు తీవ్ర జ్వయం ఉన్నా షూటింగుకి రావాల్సిందిగా పట్టుబట్టిన దోస్తానా దర్శకుడు తరుణ్ మన్సుఖాని 'భయంకరమైన వ్యక్తి' అని మధు చోప్రా అన్నారు. నీ సెట్‌లో ఆమె చనిపోవాలని నువ్వు కోరుకుంటే నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి నువ్వే బాధ్యత వహించాలి! అని దర్శకుడితో మధు చోప్రా అన్నారట. ఆ తర్వాత అన్ని విభేధాలను పరిష్కరించుకుని ఒకరికొకరు మంచి స్నేహితులు అయ్యామని తెలిపారు.