Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పెదకాపు

By:  Tupaki Desk   |   29 Sep 2023 8:38 AM GMT
మూవీ రివ్యూ : పెదకాపు
X

'పెదకాపు' మూవీ రివ్యూ

నటీనటులు: విరాట్ కర్ణ-ప్రగతి శ్రీవాస్తవ్-రావు రమేష్-ఆడుగళం నరేన్-అనసూయ భరద్వాజ్-వికాస్-తనికెళ్ల భరణి-ఈశ్వరి రావు-రాజీవ్ కనకాల తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు

నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి

రచన-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

కొత్త బంగారు లోకం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన శ్రీకాంత్ అడ్డాల.. ఆపై ముకుంద.. బ్రహ్మోత్సవం చిత్రాలతో నిరాశపరిచాడు. మధ్యలో 'నారప్ప' అనే రీమేక్ మూవీ తీసి మళ్లీ గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు 'పెదకాపు' సినిమాతో పునరాగమనం చేశాడు. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

1980 ప్రాంతంలో గోదావరి ప్రాంతంలో కుల.. వర్గ విభేదాలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న లంక గ్రామంలో సత్తి రంగయ్య (రావు రమేష్).. బయన్న (ఆడుగళం నరేన్)ల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంటుంది. వీరి మధ్య పోరు కారణంగా కింది స్థాయి వాళ్ల జీవితాలు బలైపోతుంటాయి. అందులో పెదకాపు (విరాట్ కర్ణ) కుటుంబం కూడా ఒకటి. పెదకాపు అన్నయ్య సత్తి రంగయ్య కోసం ఒక హత్య చేసి కనిపించకుండా పోతాడు. ఈ కుటుంబానికి బాగా దగ్గర అయిన గౌరి.. సత్తి రంగయ్య వల్లే ప్రాణాలు కోల్పోతుంది. తన ప్రయోజనం కోసం సత్తి రంగయ్య మీదికి పెదకాపును ఉసిగొల్పుతాడు బయన్న. ఆ పరిస్థితుల్లో పెదకాపు ఏం చేశాడు.. తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. చివరికి ఆ ఊరి రాజకీయం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'కొత్త బంగారు లోకం'.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి క్లాస్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల 'అసురన్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడని తెలిసి అందరూ షాకైపోయారు. మనిషి.. మంచితనం అంటూ సున్నితమైన సినిమాలు చేసుకుపోయే శ్రీకాంత్ 'నారప్ప' తీయడం చాలామందికి జీర్ణం కాలేదసలు. ఐతే 'నారప్ప' తీస్తూ తీస్తూ.. సొంతంగా తనెందుకు ఇలాంటి కథను డీల్ చేయకూడదని అనుకున్నట్లున్నాడు శ్రీకాంత్. కొంతమేర 'రంగస్థలం' నుంచి కూడా స్ఫూర్తి పొంది 'పెదకాపు' అంటూ 80వ దశకంలో గోదావరి ప్రాంతంలోని ఒక లంక గ్రామం నేపథ్యంగా వెట్రిమారన్ స్టైల్లో వయొలెంట్ సినిమా తీశాడు. ప్రోమోలు చూసి అడ్డాల నుంచి ఒక కల్ట్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ కలిగింది కానీ.. తెరపై ఒక తీరుగా ఓ కథను చెప్పలేక అతను పడ్డ గందరగోళం చూసి ప్రేక్షకులకు అసహనమే కలుగుతుంది. సినిమాలో ఒక ముఖ్య సన్నివేశంలో హీరో.. ''ఎలా మొదలుపెట్టాలో తెలియదు. ఎలా ముగించాలో తెలియదు'' అంటూ డైలాగ్ చెబుతుంటే.. ఈ కథను నరేట్ చేసే విషయంలో శ్రీకాంత్ పడ్డ గందరగోళానికి ఆ డైలాగ్ అతికినట్లే కనిపిస్తుంది. ఎంతో చెప్పాలని.. ఏదేదో చూపించేయాలని ట్రై చేసి చివరికి ఏం చెప్పాడో.. ఏం చూపించాడో అర్థం కాని అయోమయ స్థితిలోకి ప్రేక్షకులను నెట్టాడు శ్రీకాంత్ అడ్డాల. పార్టీ పెట్టి తెలుగు రాజకీయాలను గొప్ప మలుపు తిప్పిన ఎన్టీ రామారావుకు.. తెలుగుదేశం పార్టీకి మంచి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం ఇందులో జరిగింది కానీ.. అప్పటి గ్రామీణ రాజకీయాలను సరిగ్గా తెరపై ప్రెజెంట్ చేయడంలో శ్రీకాంత్ విఫలమయ్యాడు.

''బాగా బతకడం అంటే నిన్న కంటే ఈ రోజు బాగుండడం.. ఈ రోజు కంటే రేపు బాగుండటం''.. ''యుద్ధం తప్ప మనకి ఏదీ శాంతిని ఇవ్వదు''.. ''అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైపోయింది''.. ఇలా చెప్పుకుంటూ పోతే 'పెదకాపు'లో వారెవా అనిపించే.. ఆలోచింపజేసే డైలాగులు ఎన్నెన్నో. అలాగే బాగా తీశాడు అనదగ్గ సన్నివేశాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఐతే విడివిడిగా చూస్తే సన్నివేశాలు.. డైలాగులు బాగానే అనిపిస్తాయి. దర్శకుడు ఏదో ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగూ కలుగుతుంది. కానీ కొన్ని సీన్లు.. డైలాగులు బాగుంటే సరిపోదు కదా. కథ ఒక తీరుగా నడవాలి.. ఏ పాత్ర ఏంటో అర్థం కావాలి. ఆయా పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడాలి. కానీ 'పెదకాపు'లో అదే మిస్సయింది. హీరో సహా ఏ పాత్రనూ సరిగా తీర్చిదిద్దకుండా.. ఎప్పుడు ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో ఎటు వైపు ఉంటుందో తెలియని విధంగా.. అసలు ఎవరు ఎవరి మనిషో.. ఎవరికి ఎవరు శత్రువులో అర్థం కానట్లుగా విపరీతమైన గందరగోళం మధ్య సినిమాను ఒక దశా దిశా లేకుండా నడిపించాడు శ్రీకాంత్ అడ్డాల. అందువల్లే అతనెంతో కష్టపడ్డ విషయం అర్థమవుతున్నా సరే.. ఈ కథను ఏ దశలోనూ ఓన్ చేసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది.

కథ పరంగా.. టేకింగ్ విషయంలో 'రంగస్థలం'ను చాలా చోట్ల గుర్తు చేస్తుంది 'పెదకాపు'. ఐతే 'రంగస్థలం'లో హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం.. కాన్ఫ్లిక్ట్ పాయింట్.. అన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. అందులో ప్రతి పాత్రకూ కొన్ని లక్షణాలు.. ఉద్దేశాలు ఉంటాయి. ప్రతి పాత్రకూ ఒక ప్రయోజనమూ కనిపిస్తుంది. కానీ 'పెదకాపు'లో లెక్కకు మిక్కిలి పాత్రలు ఉన్నా.. ఏదీ అనుకున్నంతగా ఇంపాక్ట్ వేయదు. చివరికి హీరో పాత్రను సైతం సరిగా వర్కవుట్ చేయలేకపోయాడు శ్రీకాంత్. పెదకాపు క్యారెక్టర్ని హీరోలా కాకుండా ఒక పాత్రలా చూపించాలనుకోవడం మంచిదే కానీ.. అసలు ఆ పాత్ర స్వభావం ఏంటి.. కథలో దాని పాత్రేంటి అని ఆలోచిస్తే ఏమీ అంతుబట్టదు. అప్పుడప్పుడూ వచ్చి ఆవేశంగా డైలాగ్ చెప్పడం.. లేదంటే కత్తి పట్టి ఎవరో ఒకరిని నరకడం తప్ప అతను చేసిందేమీ లేదు. డైలాగుల్లో ఆ పాత్రకు ఇచ్చే ఎలివేషన్ కి.. మనం దాన్ని చూసే తీరుకు అసలు పొంతన ఉండదు. ఆ పాత్ర ఉద్దేశమేంటో.. లక్ష్యమేంటో కూడా అర్థం కాని విధంగా గాలివాటంగా వెళ్లిపోతుంటుంది. రావు రమేష్.. నరేన్.. అనసూయ.. శ్రీకాంత్ అడ్డాల.. వీళ్లందరివీ ఒక్కో దశలో ఆసక్తికరంగా అనిపించే పాత్రలే. కానీ వాటిని కూడా సరిగా ఉపయోగించుకోకుండా.. ఒక దిశానిర్దేశం లేనట్లుగా నడిపించాడు శ్రీకాంత్. రావు రమేష్ పాత్ర కథ ముగించే లాంటి కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని సన్నివేశాలు దర్శకుడి అభిరుచిని చాటుతాయి. అన్నింటికీ మించి డైలాగులు బాగున్నాయి. కానీ ఒక సినిమాగా చూస్తే 'పెదకాపు' అంతులేని గందరగోళంతో తీవ్రంగా నిరాశపరుస్తుంది.

నటీనటులు:

లీడ్ రోల్ చేసిన విరాట్ కర్ణ చూడ్డానికి బాగున్నాడు. కొత్త వాడైనప్పటికీ పెదకాపు పాత్రను కొంచెం పరిణతితోనే పోషించడానికి ప్రయత్నించాడు. కానీ తన డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు సూట్ కాలేదు. ఇక పాత్రలోని గందరగోళం అతడికి ఎక్కడిక్కడ బంధనాలు వేసింది. నటనకు.. డైలాగ్ డెలివరీకి మెరుగులు దిద్దుకుంటే విరాట్ నిలదొక్కుకోగలడు. హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ్ సహజమైన అందంతో.. నటనతో ఆకట్టుకుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ బాగా చేయగలదనిపిస్తుంది. రావు రమేష్ పాత్ర ఎలా ఉన్నప్పటికీ.. తనకే సొంతమైన విలక్షణ నటనతో దాన్ని పండించాడు. ఆడుగళం నరేన్ కూడా బాగా చేశాడు. తనికెళ్ల భరణికి కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ఆయన బాగా చేశాడు. అనసూయ భరద్వాజ్.. ఈశ్వరీ రావు చక్కగా నటించారు. వికాస్ కూడా ఓకే. ఆర్టిస్టుల్లో అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీకాంత్ అడ్డాల సైతం నటుడిగా ఒక ముద్ర వేయగలిగాడు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా 'పెదకాపు' ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. మిక్కీ జే మేయర్ మంచి పాటలు.. ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తన శైలికి పూర్తి భిన్నంగా ఈ సినిమాకు మ్యూజిక్ చేశాడతను. పాటలు అన్నీ సినిమాలో సింక్ అవ్వలేదు కానీ.. వినడానికి బాగున్నాయి. ఛోటా కే నాయుడు పనితనం ఈ సినిమాలో మరో మేజర్ హైలైట్. ఒక మూసలో సాగిపోయే ఆయన ఛాయాగ్రహణం.. ఈ సినిమాలో కొత్త కలర్లో కనిపిస్తుంది. విజువల్స్ సినిమాకు ఒక ప్రత్యేకతను చేకూర్చాయి. కొత్త హీరో మీద నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పెద్ద రిస్కే చేశాడు. ఒక మిడ్ రేంజ్ మూవీ స్థాయిలో ఖర్చు పెట్టాడు. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. కానీ రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మంచి అవకాశాన్ని వృథా చేశాడు. అతనేమీ ఆషామాషీగా సినిమా తీసేయాలని అనుకోలేదు. చాలా కష్టపడ్డ విషయం తెరపై కనిపిస్తుంది. కానీ కథను ఒక తీరుగా.. నేర్పుగా చెప్పడంలో తన వైఫల్యం.. సినిమాకు చేటు చేసింది.

చివరగా: పెదకాపు.. పెద్ద గందరగోళం

రేటింగ్ - 2.25/5