పెళ్లి చూపులు కాంబో.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు..
టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్ళి చూపులు మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే
By: Tupaki Desk | 28 Oct 2024 9:30 PM GMTటాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్ళి చూపులు మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం.. ఎనిమిదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లను రాబట్టింది. మేకర్స్ కు అదిరిపోయే లాభాలు అందించింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మోస్ట్ వాంటెడ్ సక్సెస్ గా నిలిచింది.
నటుడిగా స్ట్రగుల్ అవుతున్న టైమ్ లో మంచి హిట్ అందుకుని దూసుకుపోయారు విజయ్. అదే సమయంలో సినిమాను తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ వేరే లెవెల్ లో ప్రశంసలు అందుకున్నారు. డైరెక్షన్ లో డెబ్యూతోనే ఓ రేంజ్ హిట్ సొంతం చేసుకున్నారు. అలా విజయ్, తరుణ్ కలిపి చిన్న సినిమాతో వచ్చి ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేశారు. ఆ మూవీ తర్వాత అటు విజయ్ దేవరకొండ, ఇటు తరుణ్ భాస్కర్.. కెరీర్ లో మంచి గ్రోత్ అందుకున్నారు.
తమ తమ ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. పెళ్లిచూపులు తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి సినిమా చేస్తారని వార్తలు వచ్చినా అది జరగలేదు. ఇప్పుడు సినీ ప్రియుల ఫేవరెట్స్ లో ఒకటైన విజయ్, తరుణ్ కాంబో మరోసారి రిపీట్ అవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో మంచి సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా విజయ్ కు తరుణ్ భాస్కర్ కథ వినిపించారని సమాచారం. స్టోరీ నచ్చి దేవరకొండ ఓకే కూడా చెప్పారని తెలుస్తోంది. యాక్షన్ అండ్ కామెడీ జోనర్ లో సినిమాను తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ అవసరమని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్, తరుణ్ సినిమా చేయడానికి అనేక మంది నిర్మాతలు ముందుకు వస్తున్నట్లు వినికిడి. కానీ ఇంకా నిర్మాత ఫిక్స్ అవ్వలేదట.
త్వరలోనే స్టోరీని లాక్ చేసి.. ప్రీ ప్రొడక్షన్ పనులను తరుణ్ భాస్కర్ మొదలు పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థకే అవకాశం దక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు చిన్న సినిమాలే తీసిన తరుణ్.. విజయ్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. మరి ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.