Begin typing your search above and press return to search.

సుహాస్‌ను నమ్ముతున్నారు

సుహాస్ సినిమా అంటే కొత్తగా ఉంటుంది.. బలమైన కథ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది.

By:  Tupaki Desk   |   4 May 2024 5:30 PM GMT
సుహాస్‌ను నమ్ముతున్నారు
X

చాయ్ బిస్కెట్ సంస్థ చేసిన యూట్యూబ్ షార్ట్స్ ద్వారా పేరు సంపాదించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న కుర్రాడు సుహాస్. ఐతే తన లుక్స్ చూస్తే కామెడీ, క్యారెక్టర్ రోల్స్ ఓకే కానీ.. హీరోగా సూటవుతాడని ఎవ్వరూ అనుకోరు. కానీ లుక్స్‌ కంటే పెర్ఫామెన్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించి తనకంటూ కొంత ఫాలోయింగ్ సంపాదించాడు సుహాస్. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్రాండు లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేసి అతను ప్రేక్షకులను మెప్పించాడు. సుహాస్ సినిమా అంటే కొత్తగా ఉంటుంది.. బలమైన కథ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఇప్పుడు సుహాస్‌ కొత్త చిత్రం ‘ప్రసన్న వదనం’ చూసిన ప్రేక్షకులు కూడా సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన అర్జున్ వైకే దర్శకుడిగా పరిచయం అయిన ‘ప్రసన్న వదనం’ శుక్రవారమే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముందు రోజే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ వేయగా మంచి స్పందనే వచ్చింది. ఉదయం మార్నింగ్ షోల నుంచి కూడా మంచి టాకే వచ్చింది. దీన్ని పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పలేం కానీ.. రెండున్నర గంటలు ప్రేక్షకులను కుర్చీల్లో కుదురుగా కూర్చోబెట్టేంత థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉన్నాయి. ముఖాలు, గొంతులు గుర్తు పట్టలేని విచిత్రమైన సమస్య ఉన్న కుర్రాడి పాత్రలో సుహాస్ కన్విన్సింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ పాయింట్ చుట్టూ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించాడు దర్శకుడు. సెకండాఫ్ కొంచెం వీక్ అనిపించినా.. నరేషన్ స్లో అయినా.. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్సయినా.. సినిమా ఎక్కడ బోర్ మాత్రం కొట్టించలేదు. కొంచెం డిఫరెంట్‌గా ఉండే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిసే. సుహాస్ సినిమా అంటే కంటెంట్ ఉంటుందనే నమ్మకంతో థియేటర్లకు జనం బాగానే వస్తున్నారు. అలా వస్తున్న వారిని నిరాశ పరిచే సినిమా అయితే కాదిది.