పిండం టీజర్.. భయపెడుతున్న ఆ ఆత్మ ఎవరిది?
'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనే ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఈ ప్రచార చిత్రం సాగింది. "ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది
By: Tupaki Desk | 30 Oct 2023 7:05 AM GMTప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా మూవీటీమ్ ఫస్ట్ లుక్‌తో ప్రమోషన్స్‌ను రీసెంట్గా ప్రారంభించింది. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది.
'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనే ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఈ ప్రచార చిత్రం సాగింది. "ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది. దీనిని వెంటనే పూడ్చి పెట్టండి. లేదంటే ఈ ఊరికే ప్రమాదం" అంటూ ఈశ్వరీ రావు చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవ్వడంతో పాటు భయం కూడా మొదలవుతుంది.
ఈశ్వరీ రావు ఓ ఇంట్లోకి వెళ్ళి ఆత్మ ఆవహించిన అమ్మాయితో మాట్లాడటం.. ఆ తర్వాత 'మీ కెరీర్లో మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా ఉందా?' అని అవసరాల శ్రీనివాస్ అడగడం.. దానికి 'ఉంది. అది చాలా ప్రత్యేకమైనది. దానిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా అటువంటి దాని గురించి వినలేదు. అదొక అపారవంతమైన శక్తి కలిగి ఉన్న ఆత్మ కథ" అంటూ ఈశ్వరీ రావు సమాధానం చెప్పడం ఇంట్రెస్టింగ్గా సాగింది.
అనంతరం శ్రీకాంత్ శ్రీరామ్ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంట్లో అనుకోని సంఘటనలు జరగడం, కుటుంబ సభ్యులంతా చావు భయంతో వణికిపోతుండటం, పాపకు ఆత్మ ఆవహించినట్లు చూపించడం వంటి సన్నివేశాలను భయపెట్టేలా ఉత్సుకత రేపేలా చూపించారు.
అసలు ఆ ఇంట్లో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఎవరు? ఆ ఆత్మ కథేంటి? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ టీజర్‌ను కట్ట చేశారు. 'కళ్ళకు కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది. దాని సరిహద్దులు మనకు అర్థమవుతాయి. కానీ లోపల ప్రపంచానికి సరిహద్దులు ఉండవు. అది అంత తేలికగా అర్థంకాదు.' అంటూ ఈశ్వరీ రావు చెప్పే సంభాషణతో టీజర్‌ను ముగించారు. అయితే ఈ టీజర్ మొత్తానికి బీజీఎం హైలైట్‌గా ఉంది. ప్రతి సన్నివేశాన్ని ఉత్సుకతతో చూపించింది. మొత్తంగా హారర్ సినిమాలు ఇష్టపడే వారి సరికొత్త అనుభూతిని కలిగించింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇకపోతే ఈ చిత్రం మూడూ టైమ్లోన్లలో సాగుతుందట. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.