'పిండం'ట్రైలర్.. నిజంగా ఆత్మలు హాని చేస్తాయా?
సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో హారర్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది.
By: Tupaki Desk | 7 Dec 2023 7:54 AM GMTరోజా పూలు, ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలతో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'పిండం'. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో హారర్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. కళాహి మీడియా సంస్థ పై యశ్వంత్ దగ్గు మాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో ఈరోజు చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేశారు.
తాజాగా రిలీజ్ అయిన పిండం ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. శ్రీనివాస్ అవసరాల, ఈశ్వరి రావు మధ్య మరణం తర్వాత వ్యక్తులు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తారా? ఆత్మలు నిజంగానే మనుషులకు హాని కలిగిస్తాయా? అనే చర్చతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆంటోనీ మరియు అతని కుటుంబం ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కథ 90 ల నేపథ్యానికి మారుతుంది. ఇక ఆ ఇంట్లో రకరకాల శబ్దాలు వినిపిస్తాయి.
ఆ శబ్దాలతో చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురవుతారు. దాంతో ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. వాళ్లను రక్షించడానికి ఈశ్వరి రావు ఇంట్లోకి వస్తుంది. ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నాయని కన్ఫామ్ చేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న చిన్న పాపని జాగ్రత్తగా చూసుకోమని కుటుంబ సభ్యులకు చెప్పడం, మహాలయ అమావాస్యకముందే బిడ్డను కాపాడుకోవాలని చెప్పే డైలాగ్స్ ఆసక్తిని పెంచాయి.
ఒక వస్తువును పూడ్చినా, తగలబెట్టినా దానిలో ఉన్న అంతర్గత ఎనర్జీని ఎప్పటికీ నిర్మూలించలేమంటూ ట్రైలర్ చివరిలో చెప్పిన కొన్ని మాటలు సినిమాపై మరింత క్యూరియాసిటీని కనబరిచాయి. డ్రామా తో పాటు హారర్ ఫీల్ ఇచ్చే షాట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ట్రైలర్లో సినిమాటోగ్రఫీ, లైటింగ్ టెక్నిక్స్, బీజీయం సౌండ్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమా కథ మూడు టైమ్ లైన్స్ లో నడుస్తుంది.
1930,1990.. అలాగే వర్తమానం ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. కాగా అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావ్, రవివర్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయికిరణ్ ధైదా, కవి సిద్ధార్థ కథ అందించగా.. సతీష్ మనోహరమ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కృష్ణ సౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా.. శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.