తప్పు జరిగేది ఎక్కడ? తెలిసేది ఎలా?
కొన్ని సినిమాలు విడుదలకు ముందు నుంచే ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటున్నాయి.
By: Tupaki Desk | 1 April 2025 6:30 AMసినిమా ఇండస్ట్రీని నాలుగు మూడు దశాబ్దాలుగా పైరసీ భూతం వెంటాడుతోంది. టెక్నాలజీ పెరిగే కొద్ది పైరసీ మరింత పెరుగుతోంది. ఒకప్పుడు సినిమా విడుదలైన వారం రోజుల్లో పైరసీ సీడీలు, డీవీడీలు వచ్చేవి. ఆ సమయంలో పైరసీ వల్ల నష్టం కొంతే.. కానీ ఇప్పుడు పైరసీ వల్ల ఒక్క సినిమాకు వందల కోట్ల నష్టం. విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది. కొన్ని సినిమాలు విడుదలకు ముందు నుంచే ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈమధ్య కాలంలో విడుదలకు ముందు ఆన్ లైన్‌లో పైరసీ కాపీ అందుబాటులోకి వచ్చిన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను చూస్తే ఏ స్థాయిలో సినిమాలకు పైరసీ నష్టం చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్న ఈ రోజుల్లో హెచ్‌డీ క్వాలిటీతో ఏదైనా సినిమా పైరసీ వస్తే థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఏం ఉంది. వందల రూపాయలు ఖర్చు పెట్టి ఏముందని చాలా మంది అనుకుంటారు. ఇలా పైరసీ చేసిన వారికి పెద్దగా లాభం ఏమీ ఉండదు. అయినా నిర్మాతలకు వందల, వేల కోట్ల నష్టంను మిగుల్చుతూ పైరసీకి పాల్పడుతున్నారు. సినిమాలు ఎక్కువగా విదేశాల్లో పైరసీ అవుతున్నాయని ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చెబుతూ ఉంటారు. విదేశాల్లోని థియేటర్‌లలో హెచ్‌డి కెమెరాతో రికార్డ్ చేయడం లేదా, థియేటర్ వారిని మ్యానేజ్ చేసి ఏకంగా మాస్టర్ కాపీనే తీసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో కొత్తగా పైరసీ జరుగుతున్న పద్దతి అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
స్టార్ హీరోల సినిమాలు పైరసీ అయితే ఒకటి కాదు రెండు కాదు పదుల కోట్లు, కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు వంద కోట్లకు మించి నష్టం వాటిల్లుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది అనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. థియేటర్‌లో షూట్ చేసిన పైరసీని ఎవరూ ఆపలేరు. కానీ హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ బయటకు వస్తుంది అంటే కచ్చితంగా అది నిర్మాతల అలసత్వం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నమ్మకస్తుల చేతిలో సినిమా పెట్టక పోవడంతో పాటు, శ్రద్ద పెట్టక పోవడం వల్ల హెచ్‌డీ క్వారిటీ ప్రింట్ బయటకు వస్తున్నట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో స్క్రినింగ్‌కు వెళ్లిన ప్రింట్‌ను కొందరు కాపీ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే థియేటర్‌కి జనాలు రాకపోవడంతో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అన్ని ప్రభావితం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మల్టీప్లెక్స్‌ల్లోనూ సినిమాలు రోజుకు ఒకటి రెండు షోలు మాత్రమే ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి పైరసీ వల్ల మొత్తం ఇండస్ట్రీకి దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పైరసీ విషయంలో తక్షణ చర్యలు అవసరం. ఇక లీక్ విషయంలోనూ మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లీక్‌కి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి ఎవరూ లీక్ కి పాల్పడకుండా శిక్షలు ఉండాలని సగటు సినీ ప్రేమికుడు కోరుకుంటున్నాడు.