Begin typing your search above and press return to search.

HD పైర‌సీ భూతంతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌

థియేట‌ర్ల‌లో రిలీజైపోయిన ప్ర‌తి సినిమాని పైర‌సీలో హెచ్.డి క్వాలిటీ ప్రింట్ ని డౌన్ లోడ్ చేసుకుని చూసేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 2:14 PM GMT
HD పైర‌సీ భూతంతో త‌స్మాత్ జాగ్ర‌త్త‌
X

ఒక‌ప్పుడు పైర‌సీ లో సినిమా లీకైంది అని క‌బురు అందినా, అది లోక్వాలిటీ ప్రింట్, బ్ల‌ర్ అయ్యి విజ‌న్ లేకుండా ఉండ‌టంతో దానిని చూసేందుకు ఎవ‌రూ అంత‌గా ఆస‌క్తిని క‌న‌బ‌రిచేవారు కాదు. దానివ‌ల్ల ఇండ‌స్ట్రీకి పెద్ద డ్యామేజీ లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. థియేట‌ర్ల‌లో రిలీజైపోయిన ప్ర‌తి సినిమాని పైర‌సీలో హెచ్.డి క్వాలిటీ ప్రింట్ ని డౌన్ లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. థియేట‌ర్ ప్రింట్ కి స‌మానంగా హెచ్.డి వీడియో క్వాలిటీలో సినిమా వీక్షించే అవ‌కాశం ఉందిప్పుడు.

గ‌ల్లీ గ‌ల్లీలో ఉన్న బిటెక్ విద్యార్థులు మొద‌లు, హైస్కూల్ స్టూడెంట్స్, అభం శుభం ఎరుగ‌ని పిల్ల‌లు కూడా సినిమాల‌ను డౌన్ లోడ్ లు ఈజీగా చేసుకుని కొత్త సినిమాల్ని య‌థేచ్ఛ‌గా ఆస్వాధిస్తున్నారు. ఒక‌సారి డౌన్ లోడ్ అయిన వీడియోని ఏదోలా ఇత‌రుల‌కు షేర్ చేస్తున్నారు. దీంతో డ్యామేజీ చిన్న స్థాయిలో లేదు.

ఇప్పుడు హెచ్‌.డి. ప్రింట్ క్వాలిటీతో పైర‌సీ సినిమాని వీక్షించే సౌల‌భ్యం ఉండ‌టంతో ఇక‌పై థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసేది ఎవ‌రు? అనే ఆందోళ‌న నెల‌కొంది. త‌మిళ రాక‌ర్స్ మాఫియా స‌హా ప‌లు పైర‌సీ వెబ్ సైట్ల‌లో ఇటీవ‌ల విడుద‌లైన డ‌జ‌ను కొత్త సినిమాలు హెచ్.డి క్వాలిటీతో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. అలాగే రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ గేమ్ ఛేంజ‌ర్ ని హెచ్.డి ప్రింట్ ని పైర‌సీ మాఫియా రిలీజ్ చేసి షాకిచ్చింది. అంత‌కుముందు కంగువ, పుష్ప 2 పైర‌సీ సినిమాల‌ను డౌన్ లోడ్ చేసుకుని వీక్షించారు. ఇటీవ‌ల సంక్రాంతి సినిమాల్లో బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ పైర‌సీ ప్రింట్ ని వీక్షిస్తున్నారు. లేటెస్ట్ సినిమాల‌న్నీ హెచ్ డి క్వాలిటీ పైర‌సీ లో అందుబాటులో ఉన్నాయి.

ప‌రిస్థితి చూస్తుంటే నానాటికీ దిగ‌జారుతున్న వైనం క‌నిపిస్తోంది. పైరేట్ ల‌ను ప‌ట్టుకున్నామ‌ని చెబుతున్నా కానీ, దానికి ఎండింగ్ అన్న‌దే లేకుండా పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌రిస్థితి చూస్తుంటే ఇక‌పై ఓటీటీలు పైర‌సీ లో రిలీజైన సినిమాల‌ను కొనేందుకు జంకే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఆడియెన్ పైర‌సీలో సినిమాల‌ను వీక్షిస్తే, ఓటీటీలో చూసేందుకు ముందుకు వ‌స్తారా? అన్న‌ది సందేహం గా మారింది. దీంతో ఓటీటీ లు రైట్స్ కోసం పెద్ద మొత్తాల‌ను వెచ్చించే అవ‌కాశం లేద‌ని భావిస్తున్నారు.

పైర‌సీ ఎక్క‌డి నుంచి జ‌రుగుతుందో క‌నిపెట్టేందుకు చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. గ‌తంలో త‌మిళ్ రాక‌ర్స్ గ్యాంగ్ స‌భ్యుల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. జైల్లో వేసారు. అయినా ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. వారంతా మారుమూల థియేట‌ర్ల‌లో హెచ్.డి. కెమెరాల‌తో సినిమాని కాపీ చేసి య‌థేచ్ఛ‌గా టొరెంట్ల ద్వారా డౌన్ లోడ్ ల‌కు అందిస్తున్నారు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌గా మారింది. అరెస్టులు కూడా పైరేట్ ల‌ను ఆప‌లేవ‌ని ఇప్ప‌టికే నిరూప‌ణ అయింది. అయితే దీనికి ప‌ర్మినెంట్‌ సొల్యూష‌న్ లేదా? అంటే .. పైర‌సీకి మూలం సినీఇండ‌స్ట్రీ నుంచే పుట్ట‌డం కార‌ణ‌మ‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. చేసేది నేనే .. చేయించేది నేనే.. అంతా నేనే! అన్న‌ట్టుగా వ్య‌వ‌హారం సాగుతుండ‌టంతోనే దీనికి విరుగుడు మందు దొర‌క‌డం లేద‌ని గ‌తంలోని కొన్ని నివేదిక‌లు వెల్ల‌డించాయి. గుట్టు లీక్ చేసే ఇండ‌స్ట్రీ దొంగ‌ల్ని ప‌ట్టుకోకుండా సైబ‌ర్ క్రైమ్ అధికారులు ఏమీ చేయ‌లేర‌ని కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పైర‌సీని అదుపులోకి తేవ‌డంలో ఇక‌పై ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌నున్నాయో వేచి చూడాలి.