ఎమ్మెల్యే కం నటుడిపై లైంగిక వేధింపుల కేసు
దేశవ్యాప్తంగా మాలీవుడ్ వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలనాలు చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 29 Aug 2024 7:03 AM GMTదేశవ్యాప్తంగా మాలీవుడ్ వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలనాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వరుసగా పలువురు వేధింపుల మాన్ స్టర్స్ పై కేసులు నమోదవుతున్నాయి. పలువురు నటీమణులు బహిరంగ వేదికలపై తమకు జరిగిన అన్యాయాలను నివేధించేందుకు ధైర్యం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ఇంతకుముందు నటుడు సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించాడని నటి రేవతి సంపత్ ఆరోపించారు. పలువురు నటీమణులు ఇతర స్టార్లు రాజకీయ నాయకులపైనా ఆరోపించడం సంచలనంగా మారుతోంది. ఇప్పుడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే, నటుడు ముఖేష్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 2008 నుంచి 2012 మధ్యకాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రాణాలతో బయటపడిన ఒక నటీమణి ఫిర్యాదు మేరకు ముఖేష్‌పై `మరదు` పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వర్గాల వివరాల ప్రకారం.. ముఖేష్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్‌లు 354 (ఉద్ధేశపూర్వకంగా అగౌరవపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం) మరియు 509 (మహిళ అణకువను కించపరిచే ఉద్దేశ్యంతో పదం, సంజ్ఞ లేదా చర్య) కింద అభియోగాలు మోపారు.
2008 -2012 మధ్య జరిగిన సంఘటనలకు సంబంధించి తాను ఏడుగురిపై ఫిర్యాదు చేశానని ప్రాణాలతో బయటపడిన సదరు నటీమణి మీడియాకు తెలిపారు. చాలా ఏళ్ల క్రితం ముఖేష్ తనను అనేక సందర్భాల్లో వేధించాడని ఆమె గతంలో మీడియాకు చెప్పింది. పరిశ్రమకు కొత్తగా వచ్చినందున, భయపడినందున ఫిర్యాదు చేయలేకపోయానని ఆ నటి అన్నారు. మీ-టూ ఆరోపణల సమయంలో అతడి పేరు వినిపించింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఆగస్ట్ 26న ముఖేష్‌పై ఒక నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతమైన స్త్రీద్వేషం, అధికార దుర్వినియోగంపై సంచలన నివేదికను వెలువరించిన హేమ కమిటీ ఇప్పుడు నటీమణులకు అండగా నిలుస్తోంది. దీని వెనక కేరళ ప్రభుత్వ ప్రయత్నం అభినందనీయం. నిజానికి ప్రాణాలతో బయటపడిన నటీమణి మొదట ఫేస్‌బుక్ పోస్ట్ లో ముఖేష్‌తో పాటు మరో ఆరుగురిపై ఆరోపణ చేసారు. ఆగస్టు 27న నటులు జయసూర్య, ఎడవెల బాబు, మణియన్‌పిల్ల రాజు, ప్రొడక్షన్ కంట్రోలర్‌లు నోబుల్ - విచ్చు, అలాగే నిర్మాత కం లాయర్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు VS చంద్రశేఖరన్ సహా - ప్రతి వేధింపుల మాన్ స్టార్ పైనా కేరళ పోలీసులకు వేర్వేరు ఇమెయిల్‌లను పంపింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను ముఖేష్ తోసిపుచ్చారు. అవి తనను `బ్లాక్ మెయిల్` చేసే ప్రయత్నాలలో భాగమని పేర్కొన్నారు. ఆరోపణల పేరుతో ఒక పొగ తెరను సృష్టించడం ద్వారా తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ముఖేష్ వ్యాఖ్యానించారు.
నటి ఆరోపణల అనంతరం ఎమ్మెల్యే ముఖేష్ పై ఒత్తిడి పెరిగింది. అతడు తనపై ఆరోపణలు వచ్చాక కూడా `బ్లాక్ మెయిల్` గురించి ఎందుకు మౌనంగా ఉండాలనుకున్నాడో ముఖేష్ స్పష్టం చేయాలని ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు. అలాగే కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎస్‌ఎఫ్‌డిసి) 2023లో రాష్ట్రం కోసం ఫిల్మ్ పాలసీని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో ముఖేష్ ఉనికిపై ప్రశ్నలు తలెత్తాయి.
విలేకరులపైనే నటుడు కేసు:
హేమ కమిటీ నివేదిక పెద్ద గందరగోళానికి దారి తీస్తోంది. చాలా మంది నటీనటుల పేర్లు ఇప్పుడు లైంగిక వేధింపుల కేసుల పేరుతో వెలుగులోకి వస్తున్నాయి. అదే క్రమంలో మీడియాతో పలువురు నటుల దుష్ప్రవర్తన చర్చకు వస్తోంది. తాజాగా నటుడు కం కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేష్ గోపి తమను అవమానకరంగా నెట్టివేశాడని తమ పనిని చేయనివ్వలేదని విలేకరులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఇంతలోనే మీడియాపై సురేష్ గోపీ కూడా ఫిర్యాదు చేయడం సంచలనమైంది. త్రిస్సూర్ రామనిలయం ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు వెళ్లే క్రమంలో మీడియా ప్రతినిధులు తన మార్గాన్ని అడ్డుకున్నారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి సురేష్ గోపి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎం. ముఖేష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేరళకు చెందిన తొలి బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేష్ గోపీని విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. ``మీరు (మీడియా) ప్రజలను ప్రతి ఒక్కరితో పోరాడేలా చేయడమే కాదు... మీ స్వలాభం కోసం .. ప్రజల అవగాహనను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు`` అని సీరియస్ అయ్యారు. ``ప్రస్తుతం ఫిర్యాదులు ఆరోపణల రూపంలో ఉన్నాయి. మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు కోర్టులా? మీరు కాదు కదా! కోర్టు నిర్ణయిస్తుంది`` అంటూ సురేష్ గోపి మీడియాపై ప్రతిదాడికి దిగడం చర్చనీయాంశమైంది.
విలేఖరులు మళ్లీ ఎదురు ప్రశ్నించారు. ముఖేష్ రాజీనామాను కోరడం పార్టీ స్టాండ్ అని బిజెపి రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ అన్నారు కదా! అని ప్రశ్నిస్తూ.. సురేష్ గోపీ స్పందనను పొందడానికి ప్రయత్నించినప్పుడు అతడు వారిలో కొందరిని కోపంగా నెట్టివేసినట్లు కనిపించింది. ఈ వీడియోల ప్రకారం సురేష్ గోపి తన అధికారిక వాహనం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు విలేకరులు గోపీ వద్దకు రాగా.. ``ఇదేంటి.. నా దారి నా హక్కు.. ప్లీజ్..`` అంటూ వారిని తోసేశాడు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే కారు ఎక్కి వెళ్లిపోయారు.