Begin typing your search above and press return to search.

ఫాల్కే పేరుతో ప్ర‌భుత్వ పుర‌స్కారాలు? మోసగాళ్ల‌పై కేసు!

ఈ కార్యక్రమంలో పంపిణీ చేసిన‌ అవార్డులు జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా భారత రాష్ట్రపతి ఇచ్చిన అవార్డుకు భిన్నంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 8:02 AM GMT
ఫాల్కే పేరుతో ప్ర‌భుత్వ పుర‌స్కారాలు? మోసగాళ్ల‌పై కేసు!
X

భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే పేరుతో ఘరానా మోసం బ‌ట్ట‌బ‌య‌లైంది. దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (DPIFF) పేరుతో మోసానికి పాల్ప‌డుతున్నారంటూ, నిర్వాహకులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మాజీ సభ్యుడు శ్రీ మిశ్రా, ఆయన భార్య పార్వతి మిశ్రా, వారి కుమారుడు అభిషేక్ మిశ్రా త‌దిత‌రులపై ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేసామ‌ని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్రం స‌హా ప‌లు రాష్ట్ర ప్రభుత్వాలు మ‌ద్ద‌తునిచ్చాయ‌ని నిర్వాహ‌కులు ప్ర‌చారం చేసుకోవ‌డం కొస‌మెరుపు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖ రాజకీయ నాయకుల మద్దతు ఉంద‌ని కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు న‌మ్మ‌బ‌లికార‌ని ఆరోప‌ణ‌లొచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, సినీపోలిస్, పీవీఆర్ ఐనాక్స్ వంటి సంస్థలను స్పాన్సర్‌షిప్ కోసం మోసం చేశారనే ఆరోపణలతో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

డిపిఐఎఫ్ఎఫ్ అనేది దేశంలోని ఏకైక స్వతంత్ర ప్రపంచ చలనచిత్రోత్సవం.. దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వాన్ని గౌరవించే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాటిక్ వేడుక అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. డిపిఐఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మిశ్రా సహా ఇత‌ర‌ నిర్వాహకులు..దాదాసాహెబ్ ఫాల్కే` పేరుతో అవార్డులను చాలా మంది నటీన‌టులకు విక్రయించారని, వారి సినిమాలు వాణిజ్యపరంగా విజయవంతం కాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 19 - 20 తేదీల్లో ముంబైలోని సెల‌బ్రిటీలు నివ‌శించే బాంద్రా ప్రాంతంలోని తాజ్ ల్యాండ్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటులు పాల్గొంటున్నార‌ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఇద్దరు వ్యక్తులకు అనుమతించే గేట్ పాస్ కోసం రూ. 2.5 లక్షల చొప్పున వ‌సూలు చేస్తూ.. మోసానికి పాల్ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో పంపిణీ చేసిన‌ అవార్డులు జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా భారత రాష్ట్రపతి ఇచ్చిన అవార్డుకు భిన్నంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. భారతదేశాన్ని పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ 2002లో ప్రారంభించిన అంతర్జాతీయ పర్యాటక ప్రచార ప్ర‌క‌ట‌న `ఇన్‌క్రెడిబుల్ ఇండియా` ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వ‌హిస్తున్నామ‌ని నిర్వాహకులు పేర్కొన్నారు. అంతేకాకుండా భారత రాష్ట్రపతి అందించే `దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు`ను అందిస్తున్నామ‌ని నిర్వాహకులు న‌మ్మ‌బ‌లికారు.

ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి మోడీ, షా, పర్యాటక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వ‌యంగా రాసి ఇచ్చిన‌ శుభాకాంక్షల లేఖలను శ్రీ అనిల్ మిశ్రా ఉపయోగించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ప్ర‌భుత్వం త‌ర‌పున‌, ప‌లు సంస్థ‌ల త‌ర‌పున నిందితులు స్పాన్సర్‌షిప్ ల‌ను సేకరించార‌ని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాల పర్యాటక శాఖ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి నిర్వాహ‌కులు డబ్బును వ‌సూలు చేసారు. నిర్వాహకులు హల్దిరామ్స్, ఏసర్, సినీపోలిస్, పివిఆర్ ఇనాక్స్ వంటి కంపెనీల‌ను కూడా లక్ష్యంగా చేసుకుని వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై డిపిఐఎఫ్ఎఫ్ నిర్వాహ‌కులు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

అవార్డు కోసం అంత‌గా ఫేమ్ లేని, ఫెయిలైన‌ నటుల నుండి కూడా మిశ్రా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా అతడు స్పాన్సర్‌షిప్ పొందిన ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను మూసివేసినట్లు సంబంధిత‌ వర్గాలు తెలిపాయి. అతడు సినిమా, టెలివిజన్ , డిజిటల్ పరిశ్రమలోని కళాకారులు, సాంకేతిక నిపుణులు, కార్మికులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) చిత్రపత్ కామ్‌గర్ అఘాడి మహారాష్ట్ర అధ్యక్షుడు సమీర్ దీక్షిత్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయింది. నిర్వాహకులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318 (4) - మోసం, మోసానికి సంబంధించిన ఒప్పందాలు 319 (2) - నేరానికి శిక్ష - కింద అభియోగాలు మోపారు. ప్ర‌స్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.