హైదరాబాద్ కు ఒంగోలు పోలీసులు... ఆర్జీవీ కోసం వ్యూహం సిద్ధం!!
ఈ సమయంలో సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
By: Tupaki Desk | 13 Nov 2024 5:09 AM GMTసోషల్ మీడియా వేదికలుగా పలువురు వక్తులు.. రాజకీయ ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు, అభ్యంతరకరమైన కామెంట్లు, వారి కుటుంబంలోని మహిళలపై అసహ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టినవారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఈ విషయంలో చిన్న పెద్దా.. తన పర అనే తారతమ్యాలేవీ లేవని.. ఇలాంటి చర్యలకు పాల్పడినవారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇప్పటికే ఏపీ సర్కార్ ఇచ్చింది. ఇందులో భాగంగా... వైసీపీ నాయకుల కుటుంబంలోని మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారిని కూడా వదిలేదు లేదని స్వయంగా సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ సమయంలో సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతోపాటు వారి వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మండల టీడీపీ కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ సందర్భంగా కేసు విచారణకు హాజరుకావాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు సిద్ధం చేశారు పోలీసులు. ఈ క్రమంలో వాటిని అందజేసేందుకు ఏఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది.
అవును... రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి బయలుదేరారు! బుధవారం ఆర్జీవీకి నోటీసులు అందజేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారం అత్యంత ఆసక్తికరంగా మారింది!
పోసానిపై వరుస ఫిర్యాదులు!:
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. హైదరబాద్ ప్రెస్ క్లబ్, వైసీపీ ఆఫీస్ వేదికగా పవన్ కల్యాణ్ పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని జనసేన పార్టీ సెంట్రల్ ఏపీ జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు.
మరోపక్క పవన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రిలోని జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పవన్ పై అసభ్య పదజాలంతో దూషణలకు దిగినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసారు.
శ్రీరెడ్డిపై అనకాపల్లిలో ఫిర్యాదు!
సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్, లోకేష్, వంగలపూడి అనితపై దుర్భషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు.