ప్రతీ సినిమాకూ ఆడిషన్ అవసరం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే దర్శకనిర్మాతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 5 April 2025 5:30 PMమూడేళ్ల ముందు వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన పూజా హెగ్డేకు ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేవు. అమ్మడి నుంచి తెలుగులో సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. ఎప్పుడైతే పూజా గుంటూరు కారం సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక బాలీవుడ్ కు వెళ్లిందో అప్పట్నుంచి పూజాకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం పూజా కోలీవుడ్ లో సూర్య సరసన రెట్రో సినిమా చేస్తోంది.
ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఎలాగైనా సౌత్ లో మళ్లీ బిజీ అవాలని చూస్తోన్న పూజా హెగ్డే ఈ మధ్య కొన్ని విషయాల్లో కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తోంది. మొన్నీ మధ్యే ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం ఎక్కువ ఉంటుందని, హీరోని ఒకలా హీరోయిన్ ను ఒకలా ట్రీట్ చేస్తారని కామెంట్స్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు మరో విషయంలో కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే దర్శకనిర్మాతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ సినిమాలో హీరోలను డిఫరెంట్ గా చూపిస్తూ, వారి కోసం స్పెషల్ పాత్రలను డిజైన్ చేసే దర్శకనిర్మాతలు హీరోయిన్లను మాత్రం ఒకే విధంగా చూపిస్తున్నారని, వారితో ఒకే తరహా పాత్రలు చేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని పూజా హెగ్డే అభిప్రాయపడింది.
ఒక సినిమా కోసం హీరోయిన్ ను తీసుకుంటే ఆ మూవీకి ఆమె సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఆడిషన్ చేసి డిసైడ్ చేయాలి తప్పించి మామూలుగా తీసుకోకూడదని అంటోంది. ఈ సినిమాకు ఫలానా హీరోయిన్ సెట్ అవుతుందిలే అని మనసులో అనుకుని హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసేస్తున్నారని, అన్ని ఇండస్ట్రీల్లో ఇలా జరగదని రీసెంట్ గా ఓ తమిళ సినిమాకు ఆడిషన్ ఇచ్చిన పూజా తెలిపింది.
ఓ సినిమా కోసం తనను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుని తర్వాత డైరెక్టర్ ఆ క్యారెక్టర్ కు తాను సెట్ అవుతానో లేదో అనుకుని ఆడిషన్ చేశారని, ఆ మూవీలో చేసే హీరో ఏజ్ ఎక్కువ ఉండటంతో తన పాత్ర చిన్న అమ్మాయిలా అనిపిస్తుందని, తనను పక్కన పెట్టి తనకంటే ఎక్కువ వయసున్న హీరోయిన్ ను తీసుకున్నారని చెప్పింది. అదే ఆడిషన్ మూవీ అనౌన్స్ చేయకముందే చేస్తే బావుంటుందని పూజా చెప్తోంది. సినిమా చేసే ముందు ప్రతీ సినిమాకూ ఆడిషన్ అవసరమే అని, అప్పుడే ఆ పాత్రకు హీరోయిన్ న్యాయం చేస్తుందా లేదా అనేది తెలుస్తోందని అంటున్న పూజా తాను ఎన్ని సినిమాలు చేసినా నెక్ట్స్ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి రెడీనే అంటోంది.