దెయ్యంగా బుట్టబొమ్మ... చూడగలమా?
ఇప్పటి వరకు పూజా హెగ్డే అందాలను చూశాం. కానీ కాంచన 4లో మాత్రం ఆమెను డీ గ్లామర్‌గా చూడడంతో పాటు దెయ్యంగా చూడబోతున్నాం.
By: Tupaki Desk | 31 Dec 2024 11:30 AM GMTరాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'ముని', 'కాంచన' ప్రాంచైజీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంచైజీలో మూడు సినిమాలు వచ్చాయి. ముని, కాంచన, గంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ ప్రాంచైజీలో నాల్గవ సినిమా అంతకు మించి ఉండాలని లారెన్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. కాంచన 3 సినిమా వచ్చి దాదాపుగా ఏడు ఏళ్లు అవుతుంది. ఈ గ్యాప్‌లో రెండు మూడు సార్లు కాంచన 4 గురించిన ప్రచారం జరిగింది. కానీ పట్టాలెక్కలేదు. లారెన్స్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను ఆలస్యం చేస్తూ వచ్చాడు.
ఎట్టకేలకు రాఘవ లారెన్స్ తన హిట్ ప్రాంచైజీ మూవీని మళ్లీ పట్టాలెక్కించే ఏర్పాట్లు చేస్తున్నాడు. కాంచన 4 సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు పూజా హెగ్డే అందాలను చూశాం. కానీ కాంచన 4లో మాత్రం ఆమెను డీ గ్లామర్‌గా చూడడంతో పాటు దెయ్యంగా చూడబోతున్నాం. అందమైన బుట్టబొమ్మ పూజా హెగ్డేను దెయ్యంగా చూపించాలనే ఆలోచన లారెన్స్ కి ఎలా వచ్చింది అంటూ కొందరు పెదవి విరుస్తూ ఉంటే, ఈ సమయంలో ఆమెకు ఈ అవకాశం చాలా హెల్ఫ్ అవుతుందని అంటున్నారు.
అల వైకుంఠపురంలో సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా వరుస సినిమాలతో దూసుకు పోతుందని అంతా భావించారు. కానీ అప్పటి నుంచి ఈ అమ్మడికి డౌన్ ఫాలో మొదలైంది. ముఖ్యంగా ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ సినిమా నిరాశ పరచడంతో మళ్లీ ఈమె తిరిగి కోలుకోవడం కష్టం అన్నట్లుగా ఆఫర్లు తగ్గి పోయాయి. బాలీవుడ్‌లో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. 2024లో పూజా హెగ్డే సినిమాల్లో కనిపించింది చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా సౌత్‌లో ఈమె సందడి తగ్గి పోయింది. నార్త్‌లో మెల్లగా పెరుగుతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఇలాంటి సమయంలో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న కాంచన 4 సినిమాలో దెయ్యం పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో మళ్లీ ఈ అమ్మడి జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఆమె ఫ్యాన్స్ సైతం మళ్లీ పూజా హెగ్డే జోరు మొదలు కాబోతుంది. ఆమెకు స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తాయని అంటున్నారు. బుట్టబొమ్మగా ఇన్నాళ్లు పూజా హెగ్డేను ఒక గ్లామర్ డాల్‌గా మాత్రమే మనం చూశాం. కాంచన 4లో మొదటి సారి డీ గ్లామర్‌గానే కాకుండా ఒక దెయ్యం రూపంలో పూజా హెగ్డేను చూడబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేది చూడాలి.