బుట్టబొమ్మ బాలీవుడ్ అనౌన్స్‌మెంట్..!
ఇప్పుడు హిందీలో యంగ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటించే అవకాశం దక్కింది.
By: Tupaki Desk | 9 Dec 2024 12:30 PM GMT'రాధేశ్యామ్' తర్వాత పెద్దగా కనిపించని బుట్టబొమ్మ పూజా హెగ్డే మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఈ అమ్మడు పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. కానీ తమిళ్, హిందీలో మాత్రం ఈ అమ్మడు రెగులర్‌గా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ్ స్టార్ హీరో సినిమా కావడం విశేషం. ఇప్పుడు హిందీలో యంగ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటించే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
వరుణ్ ధావన్ ఇటీవల సమంతతో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ వెబ్ సిరీస్‌కి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా వరుణ్ ధావన్‌కి నటుడిగా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇప్పుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు.
త్వరలోనే ఈమె వరుణ్ ధావన్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనబోతుంది. ఈ సినిమాకు 'హై జవానీ తో ఇస్క్ హోనా హై' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వరుణ్ ధావన్, పూజా హెగ్డే కాంబోలో సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వీరిద్దరి మద్య కెమిస్ట్రీ కచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూజా హెగ్డేకి ఇది అతి పెద్ద ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఆఫర్లు లేకుండా దిక్కులు చూస్తున్న బుట్ట బొమ్మకి ఈ ఛాన్స్ రావడంతో మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
టాలీవుడ్‌లో ఒకానొన సమయంలో చాలా బిజీగా ఉండి స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఈ అమ్మడు మొత్తం మారిపోయింది. బిజీ బిజీగా సినిమాలు చేసే స్థాయి నుంచి ఆఫర్లు లేని స్థాయికి వచ్చింది. ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తద్వారా టాలీవుడ్‌లో ఈమెకు మళ్లీ పిలిచి మరీ ఆఫర్లు ఇస్తారు. టాలీవుడ్‌లో ఈమె చివరగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందుకే ఆఫర్లు తగ్గాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.