షూటింగ్ లో హీరోలను ఒకలా.. హీరోయిన్లను ఒకలా చూస్తారు
ఒకప్పుడు అన్ని భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా చేతిలో ఇప్పుడు అనుకున్నన్ని సినిమాలు లేవు.
By: Tupaki Desk | 22 March 2025 7:55 PM ISTరెండేళ్ల ముందు వరకు సౌత్ లో అగ్ర హీరోయిన్ గా రాణించిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలంగా ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ భాషల్లో కూడా పూజా పలు సినిమాలు చేసింది. ఒకప్పుడు అన్ని భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా చేతిలో ఇప్పుడు అనుకున్నన్ని సినిమాలు లేవు.
చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్లు అవడంతో పూజా ఫామ్ లో లేకుండా పోయింది. రాధే శ్యామ్ తో మొదలైన ఫ్లాపులు అమ్మడిని వరుసపెట్టి వెంటాడి తన క్రేజ్ ను తగ్గించేశాయి. ఫ్లాపుల మూలంగా పూజాకి క్రమంగా అవకాశాలు తగ్గాయి. దీంతో ఇప్పుడు పూజా దగ్గరకు ఎలాంటి కథను తీసుకెళ్లినా ఒప్పుకునే పరిస్థితిలో లేదు తను.
స్క్రిప్ట్ విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన రెట్రో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పూజా చాలా ఆశలు పెట్టుకుంది. రీసెంట్ గా పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ ఇంటర్వ్యూలో పూజాకు ఎప్పుడైనా తోటి నటుల వల్ల ఇబ్బంది పడ్డారా అనే ప్రశ్న ఎదురైంది.
దానికి పూజా సమాధానమిస్తూ, ఇబ్బంది అనేది అందరికీ ఒకేలా ఉండదని, అన్నీ ఇండస్ట్రీల్లోనూ ఇబ్బంది ఉంటుందని, కాకపోతే అది ఒక్కో చోట ఒక్కోలా ఉంటుందని చెప్తూ ఓ ఎగ్జాంపుల్ చెప్పింది. షూటింగ్ స్పాట్ లో హీరో కారావాన్ పక్కనే ఉంటే హీరోయిన్ల కారావాన్ మాత్రం దూరంగా పెడతారని, ఒక్కోసారి భారీ కాస్ట్యూమ్స్ ధరించి అంత దూరం నడవాలంటే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుందని పూజా చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం ఎక్కువని, హీరోయిన్లు ఎంత కష్టపడినా పోస్టర్లలో హీరోల పేరు మాత్రమే ఉంటుందని, హీరోయిన్ల పేరు ఎప్పుడూ వేయరని, లవ్ స్టోరీలు చేసినా హీరోయిన్లకు తగిన గుర్తింపు ఇవ్వరంటున్న పూజా, అందరూ కష్టపడి పనిచేస్తేనే సినిమా పూర్తవుతుందని తెలిపింది. ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు అందరూ తన అభిమాన హీరోలేనని చెప్పిన ఆమె, హీరోయిన్లలో మాత్రం అనుష్క శర్మ అంటే ఇష్టమని, ఆమె వ్యక్తిత్వానికి తాను కొంచెం దగ్గరగా ఉంటానని, ఆమెలానే తాను కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చానని పూజా తెలిపింది.