వార్సీ కామెంట్స్.. పూనమ్ ఏమన్నారంటే?
అయితే వార్సీ కామెంట్స్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు రీసెంట్ గా స్పందించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Aug 2024 8:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని ఆయన వ్యాఖ్యానించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తోపాటు అనేక మంది సినీ సెలబ్రిటీలు స్పందించారు. సౌత్ హీరోలను కించపరుస్తూ మాట్లాడడం మానుకోవాలని చురకలు అంటించారు. తన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.
అయితే వార్సీ కామెంట్స్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు రీసెంట్ గా స్పందించిన విషయం తెలిసిందే. అర్షద్ చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశారు. ఆయన చేసిన కామెంట్స్ వల్ల సినీ వర్గాల్లోని చాలా మంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ మానుకోవాలని వారికి చెప్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు.
ఇప్పుడు ఈ విషయంపై CINTAA అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు.. మూవీలోని ప్రభాస్ రోల్ కు సంబంధించిన అయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. పర్సనల్ గా ఆయనపై చేసిన కామెంట్స్ కాకపోవచ్చని అన్నారు. అయినా అర్షద్ వార్సీ నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇది కచ్చితంగా తెలుగు పరిశ్రమలో కొంత అసహనాన్ని సృష్టించిన విషయమని అన్నారు పూనమ్ ధిల్లాన్.
సినిమా పరిశ్రమలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. టాలీవుడ్ కు చెందిన బాధాకరమైన భావాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనమంతా ఒకే పరిశ్రమ అని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రభాస్ గురించి కూడా మాట్లాడారు. ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని కొనియాడారు. అలాంటి వ్యక్తి పట్ల వార్సీ బాధపెట్టే వ్యాఖ్యలు చేయరని నమ్ముతున్నానని తెలిపారు. కానీ వివరణ కోరినట్లు చెప్పారు.
కొన్ని రోజుల క్రితం.. కల్కి సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. ఆ సమయంలో ప్రభాస్ లుక్ జోకర్ ను తలపించిందని వ్యాఖ్యానించారు. మేకర్స్ అసలు ఎందుకు అలా తీశారో అర్థం కావట్లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ తోపాటు ఆయన క్యారెక్టర్ మాత్రం అద్భుతమని తెలిపారు. దీంతో అర్షద్ చేసిన కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.