రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్
ఇటీవల కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తనను పావుగా వాడుకోవాలని అనుకుంటున్నారని, ఇది సముచితం కాదని పత్రిక ప్రకటనలో పూనమ్ కౌర్ హెచ్చరించారు.
By: Tupaki Desk | 25 Sep 2023 11:55 AM GMTనటి కం సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారని, ఓ జాతీయ పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై నేడు పత్రికా ప్రకటన ద్వారా పూనమ్ కౌర్ స్పష్ఠతనిచ్చారు. ఇటీవల కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తనను పావుగా వాడుకోవాలని అనుకుంటున్నారని, ఇది సముచితం కాదని పత్రిక ప్రకటనలో పూనమ్ కౌర్ హెచ్చరించారు.
పూనమ్ కౌర్ మాట్లాడుతూ-"నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం నన్ను పావుగా వాడుకోవాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు" అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారని, మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు అని పూనమ్ కౌర్ అన్నారు. కొందరు నాయకులు సానుభూతిపేరుతో తనకు, తన కుటుంబసభ్యులకు ఫోన్లు చేస్తున్నారని పూనమ్ కౌర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీ రాజకీయాల్లోకి నన్ను లాగోద్దు అని పూనమ్ కౌర్ హెచ్చరించారు.
ప్రస్తుతం తాను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నానని, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తో కలిసి గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, ఆయనతో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నట్లు పూనమ్ కౌర్ తెలిపారు. ఇప్పటికే 15 రాష్ట్రాలు, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కుపైగా పార్లమెంట్ సభ్యులను కలిసి వారి మద్ధతు తీసుకున్నాం. మహిళా ఉద్యమ నేతలతో చర్చించాం. మహిళా హక్కుల కోసం నిరంతరం నేను గళం విప్పుతూనే ఉంటాను. చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయ స్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నాం అని పూనమ్ తెలిపారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తనవైపు నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉన్నా తానే స్వయంగా ప్రకటిస్తానని పూనమ్ కౌర్ తెలిపింది. పూనమ్ పత్రికా ప్రకటన సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.