పూనమ్ పాండే బ్రతికే ఉంది- వరస్ట్ పబ్లిసిటీ స్టంట్!
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మరణించిందన్న వార్త అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 3 Feb 2024 7:38 AM GMTబాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మరణించిందన్న వార్త అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే కనిపించాయి. అందరూ RIP పోస్టులు పెడుతూ సంతాపం తెలిపారు. చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ కోసం కూడా తెలుసుకున్నారు.
తాజాగా పూనమ్ పాండే నుంచి ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ పోస్ట్ పెట్టింది పూనమ్. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని పేర్కొంది. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని వీడియో రిలీజ్ చేసింది.
"మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళలు చనిపోయారు"
"కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. HPV వ్యాక్సిన్ ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కోవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు వైద్యశాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం" అని పూనమ్ పాండే తెలిపింది.
అయితే పూనమ్ మృతి విషయంలో మొదటి నుంచి అందరిలో అనుమానాలు రేకెత్తాయి. ఆమె నిజంగానే చనిపోయిందా అనే చర్చ జోరుగా సాగింది. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీలు మరణిస్తే వారి ఇంటికి నటులు, బంధుమిత్రులు వస్తారు. మీడియా అంతా అక్కడే ఉంటుంది. కానీ పూనమ్ పాండే ఇంటి దగ్గర అలాంటిదేమీ కనపడలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఎక్కడా మాట్లాడలేదు.
టోటల్ దేశమంతా డిస్కషన్స్ అవుతున్నా పూనమ్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు మౌనం పాటిస్తూనే వచ్చారు. దీంతో పూనమ్ పాండే మృతి వార్త కేవలం పబ్లిసిటీ స్టంటేనా అన్న అనుమానాలు కలిగాయి. ఫైనల్ గా ఆమె బతికి ఉందని వీడియో బైట్ రిలీజ్ చేయడంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వరస్ట్ పబ్లిసిటీ ఫర్ ఎవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.