జూ. ఎన్టీఆర్ - పూజా హెగ్డే... పోసాని కామెంట్స్ వైరల్!
ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.
By: Tupaki Desk | 14 Oct 2023 3:38 AM GMTఏపీలో నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అయితే... ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపిన ఆయన... మొదటగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని వెల్లడించారు.
ఇందులో భాగంగా... నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని.. వీరికి ఫైనల్ పోటీలను గుంటూరులో నిర్వహిస్తామని ప్రకటించారు పోసాని. ఇదే సమయంలో అవార్డుల ఎంపికలో ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా 12 మంది జడ్జిలను నియమించామని ఆయన చెప్పారు. ఇక, ఈ ఏడాది నుంచి "ఎన్టీఆర్ రంగస్థల అవార్డు"ను ఇస్తునామని, ఆ అవార్డుతో పాటు రూ. 1.5 లక్షలు బహుమానం ఇస్తామని తెలిపారు.
ఇదే సమయలో "వైఎస్సార్ రంగస్థల పురష్కారం" కూడా అందిస్తున్నట్లు ప్రకటించించిన పోసాని... ఈ అవార్డుతో పాటు రంగస్థల రంగానికి విశేష కృషి చేసినవారికి రూ. 5లక్షలు నగదు బహుమతి కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అవార్డుకు వైఎస్సార్ పేరు పెట్టడంపై వివరణ ఇస్తూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక 2004 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రంగ స్థలాన్ని ప్రోత్సహించారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు సహాయ సహకారాలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిబద్ధతను ప్రస్తావించిన పోసాని కృష్ణమురళి... టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని కీలక వ్యక్తులతో సీఎం స్వయంగా చర్చలు జరిపారని గుర్తుచేశారు. అంతేకాదు ఏపీలో సినిమా షూటింగ్ లు కనీసం 20 శాతం చేస్తే పన్ను రాయితీలు ఇస్తామని సైతం ప్రకటించారని అన్నారు.
ఈ సందర్భంగా ఇండస్ట్రీలో పెద్దా చిన్నా అనే తారతమ్యాలు ఈ ప్రభుత్వానికి లేవని చెప్పిన పోసాని... జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో సహా సినీ నటీనటులందరికీ గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పిస్తూ గుర్తింపు కార్డులు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టిస్టుల మధ్య బేధం చూపమని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా తమకు జూనియర్ ఎన్టీఆర్ అయినా జూనియర్ ఆర్టిస్ట్ అయినా, పూజా హెగ్డే లాంటి హీరోయిన్ అయినా అందరూ సమానమే అని, అందరినీ సమానంగా చూస్తామని తెలిపారు. ఇకపై ఆర్టిస్టులందరి సమాచారాన్ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని, ఇదే సమయంలో... చిత్రనిర్మాతలకు, అర్టిస్టులకు ప్రయోజనం చేకూర్చే చక్కటి నిర్మాణాత్మక, వ్యవస్థీకృత వేదికను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో ఆర్టిస్టులకు బస్సు రాయితీలు కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా పోసాని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి ఆన్ లైన్ లో కళాకారులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా www.apsftvtdc.in పోర్టల్ ను సిద్ధం చేశామ.. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శక, నిర్మాతల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.