పవన్ తీసుకున్న అడ్వాన్స్ అప్పు అవుతుందా?
ఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 April 2024 5:37 AM GMTఏపీ ఎన్నికల్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వైకాపాకి చెందిన నేత పోతిన మహేష్ పవన్ ఆస్తుల వివరాలేవి సక్రమంగా వెల్లడించలేదని..అంతా తప్పుల తడక అంటూ ఆరోపించారు. ముఖ్యంగా సినిమా నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను పవన్ అప్పుగా అఫిడవిట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే సినిమా నిర్మాతల నుంచి హీరో తీసుకున్న అడ్వాన్స్ అప్పు అవుతుందా? లేదా? అన్నది ఇక్కడ ఆసక్తికర అంశం.
ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే నిర్మాతలంతా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకుంటే రెండు..మూడేళ్లు ముందుగానే అడ్వాన్స్ లు చెల్లిస్తుంటారు. కొన్నిసార్లు పదేళ్లు ముందు చెల్లించినా ఆ హీరో అదే నిర్మాతతో సినిమా చేసిన దాఖలాలు ఉండవు. అలాగని ఆ నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ ని హీరో తిరిగి ఇవ్వడం అన్నది అంత ఈజీగా జరగదు. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతతో సినిమా చేస్తే గనుక అడ్వాన్స్ అనేది అప్పు అవ్వదు. ఆ తర్వాత సినిమా హిట్ ..ప్లాప్ తో హీరోకి ఎలాంటి సంబంధం ఉండదు. స్టార్ హీరోతో సినిమా అంటే నిర్మాతతో ఎలాంటీ కండీషన్లు కూడా ఉండవు.
హీరో డామినేషన్ ఇండస్ట్రీ కాబట్టి టాలీవుడ్లో అంతా హీరోలు చెప్పినట్లే నడుస్తుంది. కేవలం అడ్వాన్స్ తీసుకున్నట్లు ఒప్పంద పత్రం తప్ప! అంతకు మించి ఎలాంటి కండీషన్ అనేది ఉండదు. సినిమా ప్లాప్ అయితే తిరిగి అడ్వాన్స్ చెల్లించాలని గానీ.. పారితోషికం లో సగం తిరిగి ఇవ్వడం వంటివి ఏమీ ఉండవు. కానీ చాలా మంది స్టార్ హీరోలు నిర్మాతలు ఆర్దికంగా నష్టపోకూడదని పారితోషికంలో సగం తిరిగి ఇవ్వడం లేదా? మొత్తం వాపసు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇదంతా వాళ్లు దయాహృదయంతో చేసే పనులు.
నిర్మాత నష్టానికి హీరో బాధ్యుడు కాదని కొన్నికేసెస్ లో ప్రూవ్ అయింది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు వరుసగా వైఫల్యమైన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అంతా రజనీ ఇంటి ముందు నిరసనగా దిగిన ఉదంతం ఉంది. హీరోని నమ్మి సినిమా కొన్నారు అనే కోణంలో రజనీ కాంత్ వాళ్ల భారాల్ని మోసాడు. అలాగే పూరి జగన్నాధ్ `లైగర్` సినిమా ప్లాప్ అయినప్పుడు కూడా ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది.
డిస్ట్రిబ్యూటర్ల ఆగడాలు ఎక్కువ అవ్వడంతో పూరి రూపాయి కూడా ఇవ్వనని కరాఖండీగానూ చెప్పేసారు. సినిమా ప్లాప్ తో తనకెలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకుంటే ఏం చేస్తారు? అనే సరికి పంపిణీ దారులంతా వెనక్కి తగ్గారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల ద్వారా నష్టపోయిన వారికి ఎన్నోసందర్భాల్లో ఆర్దికంగా ఆదుకున్నారు. పారితోషికం తిరిగి ఇవ్వడం...అదే బ్యానర్ లో మరో సినిమా చేయడం...నష్టపోయిన పంపిణీ దారులకే తన సినిమా విక్రయించే లా చూడటం వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పోతిన కోణంలో చూస్తే! పవన్ అడ్వాన్స్ లు తీసుకున్న నిర్మాతతో సినిమాలు చేయకపోతే అది అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. పవన్ ఆ లెక్కనే అపిడవిట్ లో తాను తీసుకున్న అడ్వాన్స్ ని అప్పుగా గా చూపించి ఉండొచ్చు.