పొట్టేల్ షాక్ ఇవ్వబోతోందా?
ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి ఆశించిన స్థాయిలో లేకపోయింది.
By: Tupaki Desk | 22 Oct 2024 3:36 AM GMTఈ ఏడాది పెద్ద సినిమాల సందడి ఆశించిన స్థాయిలో లేకపోయింది. కల్కి ఒక్కటే బ్లాక్ బస్టర్ అయింది. దేవర జస్ట్ ఓకే అనిపించే విజయాన్ని సాధించింది. గుంటూరు కారం, ఇండియన్-2 లాంటి పెద్ద సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. ఐతే పెద్ద సినిమాలు హ్యాండ్ ఇచ్చినా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు మంచి విజయాన్నందుకుంటూ ఇండస్ట్రీ ఊపు తగ్గకుండా చూస్తున్నాయి. సంక్రాంతికి ‘హనుమాన్’, వేసవికి ‘టిల్లు స్క్వేర్’ సేవియర్ మూవీస్ అయ్యాయి. ఇక గత రెండు నెలల్లో ఇండస్ట్రీని నిలబెడుతున్నది చిన్న చిత్రాలే. పెద్దగా అంచనాల్లేకుండా వస్తున్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తూ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆగస్టులో కమిటీ కుర్రాళ్లు, ఆయ్ చిత్రాలు సూపర్ సక్సెస్ అవ్వగా.. సెప్టెంబరులో 35, మత్తు వదలరా-2 ఘనవిజయాన్నందుకున్నాయి. ఈ కోవలోనే మరో చిన్న సినిమా పెద్ద విజయం సాధించబోతోందా అనే చర్చ జరుగుతోంది టాలీవుడ్లో.
ఈ శుక్రవారం విడుదల కానున్న ‘పొట్టేల్’ మూవీ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. యువ చంద్ర అనే కొత్త నటుడు, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్కూరి అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఈ పేరుతో సినిమా రావడం చూసి ముందు జనం లైట్ తీసుకున్నారు కానీ.. సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లను ఈ సినిమా మెప్పించడం.. ఇటీవలే చక్కటి ట్రైలర్‌తో ప్రేక్షకులను పలకరించడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ చూశాక ఇదేదో ప్రత్యేకమైన సినిమాలా ఉందే అనే భావన కలిగింది ప్రేక్షకుల్లో. ఆషామాషీగా అయితే సినిమా తీసినట్లు కనిపించడం లేదు. ఒక చిన్న పిల్లను చదివించడం మీద అందరికీ కనెక్ట్ అయ్యే కథను హృద్యంగా, ఇంటెన్స్‌గా సినిమా తీసినట్లున్నాడు దర్శకుడు. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘బలగం’ లాగే ఇది కూడా సర్ప్రైజ్ హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ వారానికి ఇంకే చెప్పుకోదగ్గ సినిమా లేని నేపథ్యంలో ‘పొట్టేల్’కు టాక్ బాగుంటే మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి.