Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పొట్టేల్

గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. పేరున్న నటీనటులు.. టెక్నీషియన్లు లేకపోయినా మంచి కంటెంట్ తో చిన్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:38 AM GMT
మూవీ రివ్యూ : పొట్టేల్
X

'పొట్టేల్' మూవీ రివ్యూ

నటీనటులు: యువచంద్ర-అనన్య నాగళ్ళ -అజయ్-నోయెల్-శ్రీకాంత్ అయ్యంగార్-బేబీ తనశ్వి చౌదరి-ఛత్రపతి శేఖర్-ప్రియాంక శర్మ తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

ఛాయాగ్రహణం: మోనిష్ భూపతి రాజు

నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి-సురేష్ కుమార్ సడిగె

రచన-దర్శకత్వం: సాహిత్ మోత్ఖురి

గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. పేరున్న నటీనటులు.. టెక్నీషియన్లు లేకపోయినా మంచి కంటెంట్ తో చిన్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఈ కోవలో చేరే సినిమాలా కనిపించింది.. పొట్టేల్. దీని ట్రైలర్ స్ట్రైకింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచింది. యువచంద్ర-అనన్య నాగళ్ళ జంటగా కొత్త దర్శకుడు సాహిత్ మోత్ఖురి రూపొందించిన ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

70-80 దశకాల మధ్య పటేల్ వ్యవస్థ నడుస్తున్న సమయంలో గుర్రంగట్టు అనే తెలంగాణ పల్లెటూరిలో సాగే కథ ఇది. ఊరిలో పటేల్ కుటుంబాల నుంచి తప్ప ఎవ్వరూ చదువుకోకూడదనే నియమం ఉంటుంది. ఇది ఊరిని కాపాడే బాలమ్మ అనే దేవత పెట్టిన నియమంగా పటేల్ వారసుడైన చిన్న పటేల్ (అజయ్) అందరినీ నమ్మించి ఊరిపై తన ఆధిపత్యాన్ని సాగిస్తుంటాడు. ఐతే చదువు మాత్రమే తమ జీవితాలను మార్చగలదని నమ్మే గంగాధర్ (యువ చంద్ర) తనకు సాధ్యం కాని చదువును తన బిడ్డ బుజ్జమ్మ (బేబీ తనశ్వి)కు అయినా ఇవ్వాలనుకుంటాడు. ఊరి కట్టుబాట్లను దాటి బిడ్డకు రహస్యంగా చదువు చెప్పిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్.. గంగాధర్ మీద కక్ష కడతాడు. తన కుటుంబాన్ని నానా అవస్థల పాలు చేసి.. గంగాధర్ తో పాటు తన బిడ్డను మట్టుబెట్టడానికి ప్రణాళిక వేస్తాడు. మరి ఈ అడ్డంకులను గంగాధర్ అధిగమించగలిగాడా.. పటేల్ ను ఎదిరించి నిలబడగలిగాడా.. తన బిడ్డను చదివించగలిగాడా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తెలుగులో పల్లెటూరి కథలను పక్కన పెట్టేసి చాాలా కాలమైంది. అక్కడికి వెళ్తే ఎన్నో మట్టి కథలు దొరుకుతాయి. ఇంకా చరిత్రలోకి వెళ్తే కదిలించే కథలకు లోటే లేదు. పల్లెటూర్లలోని సంస్కృతులు.. ఆనందాలు.. కట్టుబాట్లు.. దురాచారాలు.. కష్టాలు.. కన్నీళ్లను తరచి చూస్తే ప్రేక్షకులను కదిలించే కథలెన్నో బయటికి వస్తాయనడానికి ఎన్నో రుజువులున్నాయి. కమెడియన్ వేణు 'బలగం' అనే తెలంగాణ పల్లెటూరి కథను ఎంత హృద్యంగా తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందాడో తెలిసిందే. అంతకంటే ముందు అగ్ర దర్శకుడు సుకుమార్ 'రంగస్థలం'తో ఆంధ్రా పల్లెటూరి కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఈ కోవలో ఇప్పుడు 'పొట్టేల్' అనే మరో పల్లె కథ తెరపైకి వచ్చింది. పటేల్ వ్యవస్థ ఆధిపత్యం సాగుతున్న రోజుల్లో వెనుకబడ్డ కులానికి చెందిన ఓ వ్యక్తి తన పాపకు చదువు చెప్పించడానికి చేసిన పోరాటం నేపథ్యంలో ఎంతో హృద్యంగా తెరకెక్కిన చిత్రమిది. కమర్షియల్ హంగులేమీ జోడించకుండా కేవలం కథను మాత్రమే చెప్పిన ఈ సినిమా చూస్తే ఎవ్వరైనా కదిలిపోవాల్సిందే. అంత నిజాయితీగా ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు సాహిత్ మోత్ఖురి. కానీ ఎంత ఎమోషనల్.. సెంటిమెంట్ టచ్ ఉన్నప్పటికీ.. అక్కడక్కడా అయినా హీరోయిక్ మూమెంట్స్.. హైస్ ఉండాలని ప్రేక్షకులు ఆశించడం సహజం. ఈ విషయంలో ఒకింత నిరాశకు గురిచేసినప్పటికీ 'పొట్టేల్' కచ్చితంగా ఓ గొప్ప ప్రయత్నం అనడంలో సందేహం లేదు.

ఇప్పుడంటే పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. ఎంత మారు మూల పల్లెటూరిలో అయినా తిండి.. గూడు.. చ‌దువు లాంటి ప్రాథ‌మిక అవ‌స‌రాల‌కు ఢోకా లేదు. కానీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే అగ్ర కులాల ఆధిపత్యానికి అణగారిన వర్గాలు అల్లాడి పోతూ.. రోజూ మూడు పూట‌లా ముద్ద నోట్లోకి పోని.. స‌రైన ఇల్లు లేని.. అలాగే పిల్లలు బడిలో చదువుకోలేని పరిస్థితులున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పటేల్ వ్యవస్థ ఆధిపత్యం గురించి ముందు తరాల వాళ్లు కథలు కథలుగా చెబుతారు. మూఢ నమ్మకాలు.. దురాచారాలను తమకు అనుకూలంగా మలుచుకుని పటేల్ వ్యవస్థ వేరే కులాలను తమ కాళ్లకింద పెట్టుకుని విశృంఖలంగా తయారైన ఆ రోజుల్లో ఈ కథ నడుస్తుంది. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తూ అప్ప‌టి ఓ ప‌ల్లెటూరిలో మ‌నం తిరుగుతూ అక్క‌డి మ‌నుషుల్ని చూస్తున్న భావ‌న క‌లిగేలా స‌జీవమైన పాత్ర‌లు, ప‌రిస్థితుల మ‌ధ్య‌ ఓ క‌థ‌ను న‌రేట్ చేశాడు ద‌ర్శ‌కుడు సాహిత్ మోత్ఖురి అత‌ను ఎంచుకున్న క‌థాంశం చాలా ఉదాత్త‌మైన‌ది కావ‌డం..అది అంద‌రూ రిలేట్ చేసుకునే అంశం కావ‌డంతో ప్రేక్ష‌కులు దీనికి బాగా క‌నెక్ట్ అవుతారు. పిల్ల‌ల చ‌దువు కోసం ఏ త‌ల్లిదండ్రులైనా ఎంత త‌పిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌మ స్థాయికి మించి ఖ‌ర్చు పెట్టి ఉన్న‌త చ‌దువులు చ‌దివించాల‌ని చూస్తారు. ఐతే అస‌లు బ‌డికి పంపి చ‌దివించ‌డ‌మే అసాధ్యంగా మారిన ప‌రిస్థితుల్లో.. ఓ తండ్రి దాని కోసం త‌న జీవితాన్ని ప‌ణంగా పెట్టి పోరాడే తండ్రి క‌థ ప్రేక్ష‌కుల క‌ళ్ల‌ను త‌డి చేస్తుంది. ఆ తండ్రి ప‌డే క‌ష్టం.. చేసే త్యాగాలు కాస్త సినిమాటిగ్గా అనిపించినా.. త‌న త‌ప‌నను మాత్రం ప్రేక్ష‌కులు ఫీల‌వుతారు. సినిమాను డ్రైవ్ చేసేది ఈ ఎమోష‌నే.

ద‌ర్శ‌కుడు కొన్ని ద‌శాబ్దాల కింద‌టి తెలంగాణ ప‌ల్లెటూర్ల‌లోని ప‌రిస్థితులు.. మ‌నుషులు.. సంస్కృతి.. ఆచారాల మీద ఎంతో ప‌రిశోధ‌న చేసి పొట్టేల్ సినిమా తీశాడ‌ని ప్ర‌తి స‌న్నివేశంలోనూ తెలుస్తూనే ఉంటుంది.కుల వివ‌క్ష నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు చూస్తే ప‌రిస్థితులు మ‌రీ ఇంత దారుణంగా ఉండేవా.. ఇలా ఎక్క‌డైనా జ‌రుగుతుందా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. కానీ అప్పుడ‌లాంటి ప‌రిస్థితులు ఎందుకున్నాయో స‌రైన కార‌ణాలు చూపించ‌డ‌డంతో ప్ర‌తి స‌న్నివేశం క‌న్విన్సింగ్ గా అనిపిస్తుంది. ప‌ల్లెటూర్ల‌లో దురాచారాల గురించి చాలా వివ‌రంగా.. ఆస‌క్తి రేకెత్తించేలా స‌న్నివేశాల‌ను తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. చ‌దువు లేక త‌మ్ముడిని.. చ‌దువు కావాల‌ని పోరాడి తండ్రిని ఎలా కోల్పోయాడో చూపించి.. త‌న బిడ్డ కోసం అత‌ను ప్రాణాల‌కు తెగించి పోరాడ్డం వెనుక ఎమోష‌న్లో బ‌లాన్ని పెంచాడు. ఇక అజ‌య్ చేసిన‌ విల‌న్ పాత్ర‌ను అద్భుతంగా తీర్చిదిద్ద‌డం.. అందులో త‌న పెర్ఫామెన్స్ కూడా అదిరిపోవ‌డంతో పొట్టేల్ ఆద్యంతం మంచి ఇంటెన్సిటీతో సాగుతుంది. హీరో-విల‌న్ మ‌ధ్య వైరాన్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయ‌డంతో క‌థ ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తుంది.

హీరో కుటుంబ నేప‌థ్యం గురించి చెప్ప‌డంతో మొద‌ల‌య్యే ఈ క‌థ‌.. త‌ర్వాత త‌న‌ ప్రేమ‌క‌థ‌తో మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఇంటర్వెల్ స‌మ‌యానికి క‌థ మంచి మ‌లుపు తిరిగి.. ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది. పొట్టేల్ ద్వితీయార్ధం మాత్రం ఒకింత నిరాశ‌ప‌రుస్తుంది. క‌థానాయ‌కుడికి స‌రైన టార్గెట్ ఫిక్స్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడ‌నిపిస్తుంది. రాను రాను త‌న క‌ష్టాలు పెరిగిపోవ‌డం.. క‌థ మ‌రీ సీరియ‌స్ గా న‌డ‌వ‌డంతో ప్రేక్ష‌కుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఎంత‌కీ రిలీఫ్ క‌నిపించ‌దు. క‌థలోని అంశాలు నిరాశాజ‌న‌కంగా సాగ‌డంతో పొట్టేల్ భారంగా మారుతుంది. ఐతే ప‌తాక స‌న్నివేశాలు మాత్రం ప్రేక్ష‌కులు కోరుకున్న హై ఇస్తాయి. ఇక్క‌డ కూడా హీరోయిక్ ఎలివేష‌న్లు ఏమీ లేకుండా క‌థలో భాగంగానే ఆ హై వ‌స్తుంది. క్లైమాక్స్ రియ‌లిస్టిగ్గా.. ఇంటెన్స్ గా సాగి ముగింపులో పొట్టేల్ మెరుపులు మెరిపిస్తుంది. సెంటిమెంట్ డోస్ కొంచెం త‌గ్గించి.. ద్వితీయార్ధాన్ని ఇంకొంచెం బిగితో తీర్చిదిద్దుకుని ఉంటే పొట్టేల్ వేరే స్థాయి సినిమా అయ్యుండేది. కొన్ని లోపాలున్న‌ప్ప‌టికీ.. గొప్ప క‌థతో నిజాయితీగా చేసిన ఈ ప్ర‌య‌త్నం క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు ఓ భిన్న‌మైన అనుభూతిని క‌లిగిస్తుంది. ఉదాత్త‌మైన క‌థ‌తో ముడిప‌డ్డ‌ సీరియ‌స్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవారికి పొట్టేల్ మంచి ఛాయిస్. ద‌శాబ్దాల కింద‌టి తెలంగాణ ప‌ల్లెటూరి ముఖ‌చిత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా క‌చ్చితంగా చూడాల్సిందే.

నటీనటులు:

ఈ కథను అర్థం చేసుకుని నటించగలిగే ఆర్టిస్టులనే ఎంచుకున్నాడు దర్శకుడు సాహిత్ మోత్ఖురి. కొన్ని దశాబ్దాల వెనుకటి తెలంగాణ పల్లెటూరి పరిస్థితులకు తగ్గట్లు ఆర్టిస్టులందరూ సహజంగా నటించారు. యాస సహా అన్ని విషయాల్లోనూ ఆర్టిస్టులు జాగ్రత్త పడ్డారు. యువచంద్ర కొత్త నటుడిలా అనిపించడు. అనుభవం ఉన్న వాడిలా నటించాడు. కూతురి చదువు కోసం తపిస్తూ ఏం చేయడానికైనా సిద్ధపడే తన పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. తన నటన కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తుంది. 'మల్లేశం' తర్వాత అనన్య నాగళ్ళకు మళ్లీ నప్పే పాత్ర దక్కింది. అణచివేతకు గురవుతూ అవసరమైనపుడు తిరగబడే పాత్రలో తన నటనా ఆకట్టుకుంటుంది. సినిమాలో షో స్టీలర్ అంటే.. అజయే. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఎక్కువగా చిన్న పాత్రలకే పరిమితమవుతున్న అజయ్.. ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో చెలరేగిపోయాడు. సినిమా మొదలైన కాసేపటికే ఆ పాత్రను ప్రేక్షకులు అసహ్యించుకుని తన మీద కసితో రగిలిపోయేలా అతను చాలా బాగా నటించాడు. కథకు అవసరమైన ఇంటెన్సిటీని తీసుకురావడంలో అజయ్ పాత్ర.. తన నటన కీలక పాత్ర పోషించాయి. ఇక కథకు కేంద్రమైన బుజ్జమ్మ పాత్రలో కనిపించిన చిన్నారి కూడా ఆకట్టుకుంది. నోయెల్.. శ్రీకాంత్ అయ్యంగార్.. మిగతా నటీనటులందరూ కూడా సహజంగా నటించారు.

సాంకేతిక వర్గం:

ఎక్కువగా లవ్ స్టోరీలకు పేరుపడ్డ శేఖర్ చంద్ర.. 'పొట్టేల్' లాంటి ఎమోషనల్ టచ్ ఉన్న రస్టిక్ మూవీకి అదిరిపోయే సంగీతం అందించాడు. తన నేపథ్య సంగీతం సినిమాలో ఇంటెన్సిటీని పెంచడంలో.. భావోద్వేగాలు బాగా పండేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. శేఖర్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఏవీ లేవు కానీ.. సినిమాలో ఇమిడిపోయాయి. మోనిష్ భూపతి రాజు విజువల్స్ సినిమాకు ఆకర్షణగా మారాయి. ఒకప్పటి తెలంగాణ పల్లెటూరిని ప్రతిబింబించేలా విజువల్స్ తో ఒక రస్టిక్ ఫీల్ తీసుకురాగలిగాడు సినిమాటోగ్రాఫర్. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. చిన్న సినిమా అయినా మంచి క్వాలిటీ చూపించారు నిర్మాతలు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సాహిత్ మోత్ఖురి నిజాయితీగా ఒక కథ చెప్పాలని చూశాడు. అందులో ఏమాత్రం రాజీ పడలేదు. రచయితగా.. దర్శకుడిగా తన పనితనాన్ని చాటే ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. సాహిత్ కమర్షియల్ విలువల గురించీ ఆలోచించలేదు. ఇది సినిమాకు బలమో బలహీనతో చెప్పలేని పరిస్థితి. ద్వితీయార్ధంలో కథనం కొంచెం ఎగుడుదిగుడుగా అనిపిస్తుంది. సెంటిమెంట్ డోస్ ఎక్కువైపోవడం వల్ల 'పొట్టేల్' కొంచెం భారంగా తయారైంది. సినిమాలో కొన్ని హైస్ ఉండేలా చూసుకుని ఉంటే.. దీని రీచ్ పెరిగేది.

చివరగా: పొట్టేల్.. మెలిపెట్టే మంచి కథ

రేటింగ్- 2.75/5