Begin typing your search above and press return to search.

ప్రమోషనల్ కంటెంట్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన 'పొట్టేల్'

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో, ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పొట్టేల్‌‌‌‌’

By:  Tupaki Desk   |   16 Feb 2024 7:16 AM GMT
ప్రమోషనల్ కంటెంట్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన పొట్టేల్
X

వైవిధ్యమైన కంటెంట్ తో వస్తే చాలు.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఎల్లప్పుడూ ఆదరిస్తామని ప్రేక్షకులు అనేకసార్లు నిరూపించారు. ఇటీవల కాలంలో మంచి కంటెంట్, బలమైన ఎమోషన్స్ ప్రధానంగా సాగే పలు నేటివిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.. బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అదే తరహాలోనే ఇప్పుడు పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన 'పొట్టేల్' అనే చిత్రం రాబోతోంది. ఆసక్తికరమైన టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్న సినిమా, ప్రమోషనల్ కంటెంట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో, ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పొట్టేల్‌‌‌‌’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే 'నగిరో' అనే ఫస్ట్ సింగిల్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర కంపొజిషన్ లో వచ్చిన 'వవ్వారే' అనే ఈ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.

‘అరె వవ్వారె.. వారెవవ్వా.. మెల్లంగ పొద్దిడిసే.. పోయిలోన పన్న పిల్లి లేవకా పాయే..' అంటూ సాగిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మంచి ట్యూన్ సమకూర్చారు. 'నాటు నాటు' గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఈ సాంగ్ పాడారు. గీత రచయిత కాసర్ల శ్యామ్‌‌‌‌ దీనికి క్యాచీ లిరిక్స్ అందించారు. 'ఏడ సూసిన ఒకటే తండ్లాటే ఆయే.. దారి పొడుగున మొలిశే తుమ్మ ముండ్లాయే.. పచ్చ పచ్చగా మెరిసేటి నా ఊరే.. ఇయ్యాల మసకల మసకల పొగనే చూరే.. సచ్చినోడు బతికిపోయినాడు.. బతికినోడు ఈడ సస్తాండు.. అరె పొద్దుగాల లేస్తే చాలు ఏదో చిక్కు.. ముద్ద లేకపోతే ఏది మన్ను బుక్కు’ అంటూ తెలంగాణా పల్లె పదాలను గుర్తు చేసారు. విజువల్ గానూ ఈ పాట ఎంతో బాగుంది. డ్యాన్స్ మాస్టర్ సాయి తేజ కొరియోగ్రఫీలో యువ చంద్ర వేసిన సింపుల్ స్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి.

'పొట్టేల్' సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్స్ పై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మనీష్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేసారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ మూవీలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లతో పాటుగా అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సేన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'బందం రేగడ్' అనే ఇండిపెండెంట్ ఫిలింతో దర్శకుడిగా మారిన సాహిత్ మోత్కూరి.. తొలి చిత్రంతోనే పలు అవార్డులు సాధించారు. ఆ తర్వాత 'సవారీ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు మూడో ప్రయత్నంగా 'పొట్టేల్' మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలంగాణ ఆచారాలు, సాంప్రదాయాలకు అద్దంపడుతూ విభిన్నమైన కంటెంట్ తో ఈ రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రమోషనల్ మెటీరియల్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన చిన్న సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పాలి. మరి త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.