'సలార్-2' ఇప్పట్లో మాట్లాడే పనే లేదా?
'సలార్ -2'ని 15 నెలల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణం సంస్థ హంబోలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 16 Jun 2024 6:11 AM GMT'సలార్ -2'ని 15 నెలల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణం సంస్థ హంబోలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్, జులైలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వాళ్లు ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం ఇప్పుడు మొదలైతేనే 15 నెలల్లో రిలీజ్ అన్నది సాధ్యమ వుతుంది. అదీ అతి కష్టం మీద పనిచేస్తే తప్ప రిలీజ్ సాధ్యం కాదు. కానీ ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న సన్నివేశాలు చూస్తే! 'సలార్ -2' రిలీజ్ సంగతి దేవుడెరుగు అసలు ఇప్పట్లో సినిమానే పట్టాలెక్కే అవకాశాలే లేవని కనిపిస్తుంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కమిట్ మెంట్లు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా హనురాఘవపూడి వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ప్రారంభించే ఆలోచన లేకపోతే హను ఈ సినిమా ప్రకటించే అవకాశం లేదు. దీనికంటే ముందు సందీప్ వంగ తో 'స్పిరిట్' కూడా డార్లింగ్ ప్రకటించాడు. కానీ అనివార్య కారణాలతో డిలే అయింది.
దీంతో ఇప్పుడీ రెండు చిత్రాల్ని వీలైనంత వేగంగా ప్రారంభించాలని డార్లింగ్ భావిస్తున్నాడుట. 'రాజాసాబ్' పూర్తయిన వెంటనే ఆ రెండు సినిమా పనుల్లోనే బిజీ అవుతాడని తెలుస్తోంది. డార్లింగ్ ఇలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడంతోనే ప్రశాంత్ నీల్ కూడా నిర్ణయం మార్చుకున్నాడు. ఈ గ్యాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేయోచ్చని ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇవన్నీ చూసిన తర్వాత 'సలార్ -2' సంగతేంటి? అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్డ్ అవ్వడం కష్టమని తేలిపోతుంది.
ఏడాదిన్నర కాకపోయినా రెండేళ్లు సమయం తీసుకుని అయినా ముందుగా 'సలార్ -2'నే రిలీజ్ చేస్తారని అభిమానులు భావించారు. కానీ తాజా సమీకరణాల నేపథ్యంలో 'సలార్ -2' ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది. కనీసం మూడు -నాలుగేళ్లు అయినా పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. హను రాఘవపూడి, సందీప్ వంగ సినిమాలు కూడా పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబో కూడా అంత ఈజీగా పూర్తవ్వదు. వీటన్నింటిని బేరీజు వేసుకుని చూస్తే 'సలార్ -2' నాలుగేళ్ల తర్వాత మాటగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది.