మంచు హీరోకి డార్లింగ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా..?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం "కన్నప్ప". తన స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 3:50 AM GMTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం "కన్నప్ప". తన స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు. విష్ణుకు చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. ఇలాంటి టైంలో వస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్ కు ఎంతో కీలకంగా మారింది. అందుకే అన్నీ దగ్గరుండి, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి డార్లింగ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
"కన్నప్ప" సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో, విష్ణుతో ఉన్న సాన్నిహిత్యంతో డార్లింగ్ ఈ మూవీ చేయడానికి అంగీకరించారు. ఆయనది గెస్ట్ రోల్ అయినా, సినిమాపై కలిగించే ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ డమ్ ను అందుకున్న ప్రభాస్, ఈ చిత్రంలో నటించడం వల్ల ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అవుతుంది. మార్కెటింగ్ పరంగానూ ప్రభాస్ ఫ్యాక్టర్ బాగా వర్కవుట్ అవుతుంది.
ప్రభాస్ ఉన్నాడు కాబట్టి, ‘కన్నప్ప’ సినిమాకి ఆయన అభిమానుల సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. అయితే ప్రభాస్ ప్రమోషన్స్ చేస్తే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన్ను ప్రచారంలోనూ భాగం చెయ్యాలని మంచు విష్ణు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్, తిరుపతి వంటి నగరాల్లో ప్లాన్ చేస్తున్న ఈవెంట్స్ కు ప్రభాస్ ను చీఫ్ గెస్టుగా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అది కుదరకపోతే ఒక ఇంటర్వ్యూ అయినా రికార్డ్ చేసి అన్ని భాషల్లో వదలాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, దీనికి డార్లింగ్ సైడ్ నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందో చూడాలి.
వాస్తవానికి అతిథి పాత్ర చేయడం ద్వారా 'కన్నప్ప' చిత్రానికి ప్రభాస్ తనవంతు సపోర్ట్ చేశారు. బాహుబలి స్టార్ నటిస్తున్నాడనే టాక్ బయటకు వచ్చిన తర్వాతే, ఇది క్రేజీ ప్రాజెక్ట్ గా మారిందనేది నిజం. రీసెంట్ గా IMDb రిలీజ్ చేసిన 2025 టాప్-20 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో కన్నప్ప 11వ స్థానంలో ఉంది. సినీ ప్రియుల్లో ఈ మూవీపై ఇంతటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి, నార్త్ జనాలు మాట్లాడుకోడానికి ప్రభాసే ప్రధాన కారణమని చెప్పాలి. మంచు విష్ణు సైతం ప్రతీ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చెబుతూ, సినిమాపై హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
'కన్నప్ప' చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ తో పాటుగా అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల తదితరులు ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఇది భక్తి చిత్రం మాత్రమే కాదని, ఒక చరిత్ర అని మేకర్స్ చెబుతున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. ఇప్పటికే రిలీజైన క్యారక్టర్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మూవీ టీజర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. AVA ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన విష్ణు.. ప్రతీ సోమవారం ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ లుక్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. చూద్దాం.. డార్లింగ్ ఫ్యాక్టర్ ఈ మూవీకి ఏ మేరకు పని చేస్తుందో..!