Begin typing your search above and press return to search.

ఆయన గురించి అందరికి గొప్పగా చెప్పిన ప్రభాస్

తాజాగా అతడు ఓ స్పెషల్ షోలో పాల్గొన్నాడు. లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకాలతో సాగే ఈ కార్యక్రమానికి ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే పేరు పెట్టారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 9:48 AM GMT
ఆయన గురించి అందరికి గొప్పగా చెప్పిన ప్రభాస్
X

టాలీవుడ్‌లోని హీరోలు అందరూ ఏమాత్రం తీరిక లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక హీరో మాత్రం ఏకధాటిగా పాన్ ఇండియా చిత్రాలనే లైన్‌లో పెడుతున్నాడు. అతడే రెబెల్ స్టార్ ప్రభాస్. సినిమాల పరంగా ఏమాత్రం వెనక్కి తగ్గని అతడు.. ఇండియన్ సూపర్ స్టార్‌గా చలామణి అవుతున్నాడు.

ఒకదాని తర్వాత ఒకటి అంటూ ఫుల్లుగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఖాళీ సమయంలో మాత్రం పర్సనల్ ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ, తాజాగా అతడు ఓ స్పెషల్ షోలో పాల్గొన్నాడు. లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకాలతో సాగే ఈ కార్యక్రమానికి ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే పేరు పెట్టారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దీన్ని ప్రసారం చేస్తోంది.

దిగ్గజ గేయ రచయిత అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకాలతో సాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఆయనతో తనకు ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సిరివెన్నెలను మొదటిసారి ‘వర్షం’ సినిమా షూటింగ్ సమయంలో కలిశానని రెబల్ స్టార్ వెల్లడించాడు. నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పడంతో సిరివెన్నెలతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్‌లో పాల్గొన్నానని తెలిపాడు.

ప్రభాస్ ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మెల్లగా కరగని అంటూ మెలోడీ సాంగ్ పాడుతుంటే విని నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అని ఆయన అంటే.. నేను మాత్రం దీనికంటే ఐ లవ్ యూ శైలజ అనే బాగుంది కదా అని అనుకున్నాను’ అని పేర్కొన్నాడు. తద్వారా సిరివెన్నెల వంటి లెజెండ్‌తోనే తాను చాలా క్లోజ్ గా మాట్లాడినట్లు చెప్పాడు.

ఇదే షోలో ప్రభాస్ ‘అసలు సిరివెన్నెల గారు రొమాన్స్‌ను ఎంతో బ్యూటిఫుల్‌గా రాసేవాళ్లు. ఆ లిరిక్స్ ఎప్పటికీ గుర్తుండాలి అంటే అందులోని అందం, రాసిన వాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. నేను చాలా మందిని పిలిచి శాస్త్రి గారు చూడండి ఎలా రాశారో అని చెప్పేవాడిని. ఒక్కోసారి నేను ఎక్కువగా చెప్తుంటే అబ్బా మొదలెట్టేశాడురా అనేవాళ్లు’ అని తన బంధాన్ని పంచుకున్నాడు.

సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకు ఉన్న అనుబంధం గురించి వెల్లడిస్తూ ప్రభాస్‌ చేసిన ఈ షోకు సంబంధించిన వీడియో తాజాగా వచ్చింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ ప్రోమో చాలా తక్కువ సమయంలోనే ఫుల్ వైరల్‌గా మారిపోయింది.