పవన్ హిట్ సాంగ్.. ప్రభాస్ కు ఎంత ఇష్టమో చెప్పలేం!
"ఛలోరే ఛలోరే చల్ సాంగ్ పెప్పీగా ఉంటుంది. హైలో ఉంటూ బాగుంటుంది. మంచి ఫిలాసపీ ఉంటుంది. పాటలో ప్రతి లైన్ కూడా బాగుంటుంది.
By: Tupaki Desk | 11 Nov 2024 5:52 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సాంగ్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన పలుమార్లు స్వయంగా ఆ విషయాన్ని తెలిపారు. ఎప్పుడూ సాంగ్స్ ను వింటూ ఉంటారు డార్లింగ్. ఇండస్ట్రీలోని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ల వర్క్ పై ఫోకస్ పెడుతుంటారట. తన సినిమాల్లోని పాటలతో పాటు మిగతా హీరోల సాంగ్స్ ను కూడా ఇష్టపడుతుంటారు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తనకు ఇష్టమైన పాటలేంటో తెలిపారు.
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీలోని ఛలోరే ఛలోరే చల్ సాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు ప్రభాస్. "ఛలోరే ఛలోరే చల్ ఆ సాంగ్ ఎంతో ఇష్టమో చెప్పలేను.. ఫ్రెండ్స్ తో పాటు అందరినీ పిలిచి ఆ పాట మీనింగ్ ఎలా ఉందో వినాలని చెబుతుంటా.. కొన్నిసార్లు అలా చెప్పడం స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ పారిపోయారు. చాలా సార్లు మీనింగ్ చెప్పా.. పార్టీల్లో లేట్ నైట్ లో ఆ పాట ప్లే చేస్తానని స్నేహితులు భయపడుతుంటారు" అని తెలిపారు.
"ఛలోరే ఛలోరే చల్ సాంగ్ పెప్పీగా ఉంటుంది. హైలో ఉంటూ బాగుంటుంది. మంచి ఫిలాసపీ ఉంటుంది. పాటలో ప్రతి లైన్ కూడా బాగుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్.. ఎలా రాశారో.. సిరివెన్నెల గారు ఎంత బాగా రాశారో.. మొత్తానికి ఒక్కసారి లేపి మళ్లీ కిందకు తీసుకొచ్చారు. మనం రొటీన్ లైఫ్ స్టైల్ గురించి ఉద్దేశించి ఆ సాంగ్ రాసినట్లు నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది. మళ్లీ మళ్లీ సాంగ్ వింటాను" అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ చక్రం సినిమాకు గాను సిరివెన్నెల రాసిన జగమంత కుటుంబం నాది పాట సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన పాటల జాబితా సిద్ధం చేస్తే అందులో ఆ సాంగ్ కచ్చితంగా ఉంటుందని ప్రభాస్ తెలిపారు. ఆ పాట సాహిత్యం వెనుక ఉన్న అర్థం తెలిసి తనకు ఒక్క క్షణం మతిపోయిందని, అలా కూడా రాయగలరా అని షాకయ్యానని చెప్పారు.
ప్రస్తుతం ఛలోరే ఛలోరే చల్ సాంగ్ గురించి ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ కు ఇష్టమైన ఆ పాట ఎంతో మందికి ఫేవరెట్ అని నెటిజన్లు చెబుతున్నారు. డార్లింగ్ లాంటి స్టార్ హీరో సాహిత్యం గురించి షేర్ చేసుకోవడం అరుదైన విషయమని అంటున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.