ప్రభాస్ పంపిన క్యారేజీ తిన్నాక జగ్గూభాయ్ ఫీలింగ్!
ప్రభాస్ అందరికీ డార్లింగ్. అభిమానులు, పరిశ్రమ వ్యక్తులు డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తారు.
By: Tupaki Desk | 9 Dec 2024 6:08 PM GMTప్రభాస్ అందరికీ డార్లింగ్. అభిమానులు, పరిశ్రమ వ్యక్తులు డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తారు. ప్రభాస్ అంటే స్నేహం, సహాయం, రుచికరమైన ఆహారం ఇంకా ఎన్నో గొప్ప లక్షణాల కలయిక అని సన్నిహితులు చెబుతూనే ఉంటారు. ఆయన విందుకు పిలిస్తే క్యాటరింగ్ భారీగా ఉంటుందని శుచిగా భోజనం చేసిన ప్రతి ఒక్కరూ చెబుతారు.
ప్రభాస్‌తో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరూ .. సన్నిహిత మిత్రులు, అతడి సహనటులు, కథానాయికలు అతడు వడ్డించే రుచికరమైన వంటకాలు అందులో వెరైటీల గురించి మాట్లాడుకుంటారు. అతడిని కలిసేందుకు ఎవరు వెళ్లినా కడుపు నిండా భోజనం చేసి రావాలనేది నియమం. అంతేకాదు.. ప్రభాస్ వీలున్న ప్రతిసారీ తన బంధుమిత్రులకు రుచికరమైన ఆహారం నింపిన క్యారేజీని పంపుతుంటాడు.
అలాంటి ఒక క్యారేజీ జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబుకు అందింది. ఆయన దానిని ఫ్లూటుగా తిని హాయిగా నిదురించానని చెబుతున్నారు. జగపతి బాబు కోసం డార్లింగ్ పంపించిన యమ్మీ యమ్మీ ఫుడ్ ఇప్పుడు అందరి నోళ్లు ఊరిస్తోంది.
ప్రస్తుతం `దేవా` షూటింగ్‌కి వచ్చాను. నా కోసం ప్రభాస్ పంపిన వంటకాలు చూశారా? అని జగపతి బాబు ఓ వీడియో చేసి చూపించాడు. ప్రభాస్ పంపిన భోజనం క్యారేజీ వెరైటీలు చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. వెజ్ - నాన్ వెజ్‌లో చాలా రకాల ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు.. అంటూ జగపతిబాబు `మాయాబజార్` పాటతో కూడిన వీడియోను షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. తాను బకాసురుడిలా తిన్నానని, కుంభకర్ణుడిలా నిద్రపోయానని జగపతి బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. అయితే ఇది పాత వీడియో.. కానీ జగ్గూభాయ్ ఇప్పుడు షేర్ చేశారు.
ప్రస్తుతం నటుడు జగపతి బాబు పోస్ట్‌పై ప్రభాస్ అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇంత తిండి ఒక్కడివే తిన్నావా? అని ఒకరు.. ఇంత తిండి ఒక్కడికేనా? ఇదేంటి ప్రభాస్? అని మరికొందరు ప్రశ్నించారు. కొందరు `సలార్-2` అప్ డేట్ అడిగారు. సలార్ సినిమాలో కింగ్ మన్నార్ పాత్రలో జగపతిబాబు నటించిన సంగతి తెలిసిందే.
భీమవరం రాజులకు ప్రభాస్ ఒక ల్యాండ్ మార్క్. పుట్టింది చెన్నైలో అయినప్పటికీ ప్రభాస్ తల్లిదండ్రులు భీమవరానికి చెందినవారు. అందుకే తన ఊరికి తన బంధువులెవరైనా వచ్చారని తెలిసినా ప్రభాస్ కూడా ఇలాగే భోజనం ఏర్పాటు చేస్తాడు. ఒక లంచ్ క్యారియర్ వారి స్థలానికి వెళుతుంది. ఇంతకుముందు నటుడు కృష్ణంరాజు సంస్మరణ సందర్భంగా వేలాది మంది అభిమానులకు ప్రభాస్ భోజన ఏర్పాట్లు చేశారు. వారు తమ అభిమానులకు రాజుల భోజనం పెట్టారు. రకరకాల వెజ్ నాన్ వెజ్ వంటకాలను వడ్డించారు. ప్రభాస్‌కు ఆహారమంటే ఇష్టమే కాదు. వ్యక్తిగతంగా ప్రభాస్ తన అభిరుచిని విందులో కూడా ప్రదర్శిస్తారు.
ప్రభాస్ ప్రస్తుతం `ది రాజా సాబ్`, `ఫౌజీ` చిత్రాల్లో నటిస్తున్నారు. `సలార్-2` చిత్రీకరణ కూడా ప్రారంభిస్తారు. హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం ఉంది. రిషబ్ శెట్టి ఒక సినిమాకి కథ రాయనున్నాడని కూడా కథనాలొస్తున్నాయి.