Begin typing your search above and press return to search.

సరికొత్త ప్రపంచం.. 'ఫౌజీ' గురించి హను కామెంట్స్‌

అయితే దర్శకుడు హనురాఘవపూడి తన టైటిల్స్‌ను విభిన్నంగా పెడతాడు. కనుక ప్రభాస్ సినిమాకు ఫౌజీ కంటే మరింత విభిన్నంగా ఉండే టైటిల్‌ ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

By:  Tupaki Desk   |   21 Jan 2025 11:30 AM GMT
సరికొత్త ప్రపంచం.. ఫౌజీ గురించి హను కామెంట్స్‌
X

ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న 'రాజాసాబ్‌'తో పాటు 'ఫౌజీ' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా సీతారామం వంటి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఊహల్లో తేలిపోతున్నారు. హను రాఘవపూడి తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి అదే తరహాలో తనదైన మార్క్‌ క్లాస్ టచ్‌తో ఫౌజీ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో ప్రేమను ఈ సినిమాలో చూపిస్తూ కథ సాగుతుందని తెలుస్తోంది.

గత పదేళ్లుగా ప్రభాస్‌ను చూడని యాంగిల్‌లో దర్శకుడు హను రాఘవపూడి చూపించబోతున్నాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ... ప్రేక్షకులు మునుపు ఎన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక అద్భుత దృశ్యం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ ఆ దృశ్య కావ్యం మిమ్ములను మంత్రముగ్దులను చేస్తుందని హామీ ఇస్తున్నాను అని హను రాఘవపూడి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఉన్న అంచనాలు హను రాఘవపూడి చేసిన వ్యాఖ్యలతో మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.

ఫౌజీ అనే టైటిల్‌ను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. వర్కింగ్‌ టైటిల్‌గా దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దర్శకుడు హనురాఘవపూడి తన టైటిల్స్‌ను విభిన్నంగా పెడతాడు. కనుక ప్రభాస్ సినిమాకు ఫౌజీ కంటే మరింత విభిన్నంగా ఉండే టైటిల్‌ ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. టైటిల్‌ ఏది అయినా ప్రభాస్‌తో హను రాఘవపూడి తీస్తున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాతో సోషల్‌ మీడియా సెలబ్రెటీ అయిన ఇమాన్విని హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నారు. ప్రభాస్‌ పక్కన ఇమాన్వి చక్కగా ఉందని పూజా కార్యక్రమాల ఫోటోలకు పాజిటివ్‌ స్పందన వచ్చింది.

ప్రభాస్‌ సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు. ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్‌ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ ఏడాదిలో మాత్రం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని కుదిరితే ఇదే ఏడాదిలో ఫౌజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు హను రాఘవపూడి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌ చాలా కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న కారణంగా ఫౌజీ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉందా అనేది చూడాలి.