'స్పిరిట్' కోసం ప్రభాస్ ప్రత్యేకంగా..!
స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండబోతుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 21 Feb 2025 1:30 PM GMTప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించడంతో ప్రభాస్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ వరుసగా మూడో సినిమాతోనూ వెయ్యి కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ప్రభాస్ ఈ ఏడాది సమ్మర్ చివరి వరకు రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాజాసాబ్‌తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాతోనూ ఇదే ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రాజాసాబ్, ఫౌజీ సినిమాల కంటే ప్రభాస్ అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'స్పిరిట్'. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా రూపొందుతోంది. యానిమల్ సినిమాతో వెయ్యి కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న సందీప్ వంగ అంతకు మించి అన్నట్లుగా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను రూపొందించబోతున్నాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండబోతుందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగ సినిమా అనగానే హీరో పాత్ర చాలా వైల్డ్‌గా ఉంటుంది అనే విషయం తెల్సిందే. ఈ సినిమాలోనూ ప్రభాస్ అంతే వైల్డ్‌గా ప్రవర్తించబోతున్నాడు. అందుకు తగ్గట్లుగా ప్రభాస్ లుక్‌ను డిజైన్ చేస్తున్నాడు. గత రెండు నెలలుగా ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం ఫిజికల్ వర్కౌట్స్ మొదలు పెట్టాడు. స్పిరిట్‌లో చాలా స్పెషల్‌గా కనిపించడం కోసం ప్రభాస్ ప్రత్యేకమైన వర్కౌట్లు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమా బాక్సాఫీస్‌ను షేర్ చేయాలి అంటూ కచ్చితంగా ప్రభాస్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లుక్ తో పాటు పాత్ర, యాక్షన్ సన్నివేశాల్లోనూ ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో చూపించాలి.
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌ను దర్శకుడు సందీప్ వంగ చూపించిన తీరుకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాలోనూ విజయ్ దేవరకొండను సందీప్ వంగ తనదైన శైలిలో చూపించాడు. ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నవారు హీరో ఎలా అవుతారు అంటూ ఆశ్చర్యపోయే విధంగా సందీప్ రెడ్డి వంగ హీరోలు ఉంటారు. ఈసారి కూడా అదే విధంగా సందీప్ వంగ తన స్పిరిట్ సినిమాలో హీరో పాత్రను డిజైన్ చేశారట. అందుకు తగ్గట్లుగా ప్రభాస్ లుక్‌ను ఫిజిక్‌ను మార్చుకుంటున్నాడు. భారీ ఎత్తున ఖర్చు చేస్తూ ఈ సినిమాను భూషన్ కుమార్ నిర్మించబోతున్నారు. పాన్ వరల్డ్‌గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.