Begin typing your search above and press return to search.

ప్రభాస్, ఎన్టీఆర్.. నెక్స్ట్ ఎవరు?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్ బెంచ్ మార్క్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:03 AM GMT
ప్రభాస్, ఎన్టీఆర్.. నెక్స్ట్ ఎవరు?
X

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్ బెంచ్ మార్క్ గా మారిపోయింది. ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే, ఈ రెండిటిలో ఏదొక మైలురాయి అధిగమించాలని అభిమానులు లెక్కలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ విషయానికొస్తే, ఇప్పటి వరకూ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ముగ్గురు హీరోలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక క్లబ్స్ లో చేరారు.

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ‘బాహుబలి 1’ సినిమాతో తొలిసారిగా రూ.500+ కోట్ల సినిమాని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. ఆ తర్వాత ‘బాహుబలి 2’ ఏకంగా రూ.1814 కోట్ల గ్రాస్ రాబట్టి, ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. దీంతో ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ 500, 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హీరోగా నిలిచారు. అనంతరం రాజమౌళి సహాయం లేకుండానే రెండుసార్లు ఈ ప్రెస్టీజియస్ క్లబ్ లో చేశారు.

‘బాహుబలి 2’ తర్వాత ఐదు పాన్ ఇండియా సినిమాలతో వచ్చారు ప్రభాస్. వాటిల్లో 'సలార్' మూవీ 600+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. 'కల్కి 2898ఏడీ' సినిమా 1000 కోట్ల మార్క్ ను అధిగమించింది. ఇక రాజమౌళి తీసిన RRR చిత్రంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ మైలురాయి క్లబ్ లో చేరిపోయారు. లేటెస్టుగా కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర 1' చిత్రంతో తారక్ సోలోగా రూ.500+ కోట్ల మార్క్ ను టచ్ చేసి చూపించారు.

ఇలా ప్రభాస్ అత్యధికంగా నాలుగు సార్లు 500+ కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తే, ఎన్టీఆర్ రెండుసార్లు ఈ మైలురాయి క్లబ్ ను అందుకున్నారు. అలానే వీరిద్దరూ జక్కన్న అండ లేకుండానే 500 కోట్ల క్లబ్ లో చేరిన టాలీవుడ్ హీరోలుగా నిలిచారు. దీంతో నెక్స్ట్ ఈ ఘనత వహించే తెలుగు హీరో ఎవరు? సోలోగా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉన్న హీరో ఎవరు? అనే డిస్కషన్ ఫ్యాన్స్ సర్కిల్స్ లో మొదలైంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమాతో 500 కోట్లు మాత్రమే కాదు, 1000 కోట్ల క్లబ్ లోనూ చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘పుష్ప 1’ మూవీతో 300+ కోట్ల దగ్గర ఆగిపోయాడు బన్నీ. ఇప్పుడు ‘పుష్ప 2’ హైప్ చూస్తుంటే, ఈసారి కచ్ఛితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ, డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇక రామ్ చరణ్ కి కూడా ఆ స్టామినా ఉందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' తో ఆ ఫీట్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. మరి బన్నీ, చెర్రీలో ఎవరు రాజమౌళి సపోర్ట్ లేకుండా రూ.500 కోట్ల మైలురాయి మార్క్ ను క్రాస్ చేస్తారో చూడాలి.