ప్రభాస్ కొత్త సినిమా అప్‌డేట్..!
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయినా సినిమాలను ఇంకా కొత్తగా కమిట్ అవుతూనే ఉన్నాడు.
By: Tupaki Desk | 15 Feb 2025 7:25 AM GMTప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయినా సినిమాలను ఇంకా కొత్తగా కమిట్ అవుతూనే ఉన్నాడు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు. ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీ లైన్‌కి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ పూర్తి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. మూడు నెలలుగా తన టీంతో పాటు ప్రభాస్‌కి అత్యంత సన్నిహితులు అయిన ఒకరు ఇద్దరితో కలిసి ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితే ప్రభాస్ వద్దకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ సినిమాను చేస్తున్నాడు. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న జై హనుమాన్ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ముగించి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి పంపించే యోచనలో ఉన్నారు. కాంతార స్టార్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా జై హనుమాన్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జై హనుమాన్ సినిమా తర్వాత మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ అయ్యింది.
బాలీవుడ్‌లో ప్రముఖ హీరోతో ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయాల్సి ఉండగా ప్రారంభంకు ముందు క్యాన్సల్ అయ్యింది. ఆ హీరో మరెవ్వరో కాదు.. రణ్వీర్ సింగ్ అనే విషయం తెల్సిందే. స్క్రిప్ట్ విషయంలో విభేదాల కారణంగానే క్యాన్సల్ అయ్యిందని తెలుస్తోంది. తాజాగా మోక్షజ్ఞ సినిమా విషయంలో ఏం జరిగింది అనేది మాత్రం క్లారిటీ లేదు. చివరి నిమిషంలో సినిమా క్యాన్సల్ కావడంతో నందమూరి అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ సైతం జరుగుతుంది. ఈ సినిమా అయినా పట్టాలు ఎక్కేనా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ప్రభాస్‌తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
ఇక ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా చివరి దశ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్నాడు. ఇదే ఏడాదిలో రాజాసాబ్, ఫౌజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే ఏడాదిలో సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనూ సినిమా అంటే కచ్చితంగా రాబోయే రెండు మూడు ఏళ్లలో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అనడంలో సందేహం లేదు.