బ్రహ్మ రాక్షసుడిగా ప్రభాస్.. నిజమేనా?
ఇలా ప్రభాస్ - ప్రశాంత్ కమిట్మెంట్స్ పూర్తవ్వడానికి చాలా టైమ్ పట్టొచ్చు. ఒకవేళ 'బ్రహ్మ రాక్షస్' వార్తలు నిజమే అయితే, ఇది పట్టాలెక్కడానికి రెండు మూడేళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 2 Nov 2024 11:30 PM GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ, ఆయన చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, ప్రభాస్ కు ప్రశాంత్ ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇది గతంలో రణవీర్ సింగ్ తో చేయాలనున్న 'బ్రహ్మ రాక్షస' కథ అని అనుకుంటున్నారు.
'హను-మాన్' బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత, ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. హిందీ స్టార్ హీరో రణవీర్ సింగ్ కు తాను రాసుకున్న 'బ్రహ్మ రాక్షస' కథ చెప్పి మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. రణవీర్ తో ఫోటో షూట్ కూడా చేసినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ, అధికారిక ప్రకటన రాకముందే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే పట్టాలెక్కలేదనే రూమర్లు కూడా వినిపించాయి. అయితే ప్రశాంత్ అదే స్టోరీని ప్రభాస్ తో చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'బ్రహ్మ రాక్షస' అనేది మైథలాజికల్ టచ్ ఉన్న పీరియాడికల్ ఫిల్మ్ అని టాక్ ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగానే ఈ మూవీ ఉంటుందట. అంతేకాదు ఇందులో హీరో పాత్ర కాస్త గ్రే షేడ్స్‌తో ఉంటుందని అప్పట్లో అనుకున్నారు. ఎన్నాళ్ళ నుంచో నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారక్టర్ ప్లే చెయ్యాలని చూస్తున్న ప్రభాస్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
కాకపోతే ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఇప్పుడప్పుడే సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రశాంత్ ప్రస్తుతం 'హనుమాన్' సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే సినిమా చేస్తున్నారు. అలానే తన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. ఇవి కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరికొన్ని సినిమాలకు కథలు అందించడానికి రెడీ అయ్యారు.
మరోవైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్' సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. హను రాఘవపూడి చిత్రాన్ని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్ళారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' మూవీని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఇవి కాకుండా 'సలార్ 2', 'కల్కి 2' ప్రాజెక్ట్స్ డార్లింగ్ లైనప్ లో ఉన్నాయి. ఇలా ప్రభాస్ - ప్రశాంత్ కమిట్మెంట్స్ పూర్తవ్వడానికి చాలా టైమ్ పట్టొచ్చు. ఒకవేళ 'బ్రహ్మ రాక్షస్' వార్తలు నిజమే అయితే, ఇది పట్టాలెక్కడానికి రెండు మూడేళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.