Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ లుక్‌పై AI ఎఫెక్ట్.. మళ్ళీ ఇదెక్కడి గోల

తెలుగు సినిమా ద్వారా ఎంతో మంది హీరోలు తమ రేంజ్‌ను పెంచుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 6:30 AM GMT
ప్రభాస్‌ లుక్‌పై AI ఎఫెక్ట్.. మళ్ళీ ఇదెక్కడి గోల
X

తెలుగు సినిమా ద్వారా ఎంతో మంది హీరోలు తమ రేంజ్‌ను పెంచుకున్నారు. కానీ, కొందరు మాత్రం టాలీవుడ్ స్థాయినే పెంచేశారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందుగా చెప్పాలి. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇలా వరుసగా భారీ భారీ ప్రాజెక్టులనే చేసుకుంటూ ఎవరికీ అందనంతగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్నాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే చాలా చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో ‘ది రాజా సాబ్’ మూవీ ఒకటి. మారుతి రూపకల్పనలో రాబోతున్న ఈ చిత్రం హర్రర్ కామెడీతో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. ఇలా ఇప్పటికే సగానికి పైగా టాకీ పార్టును కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది.

మారుతి - ప్రభాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్లతో పాటు ఓ గ్లింప్స్ వీడియో కూడా విడుదల అయింది. ఇవన్నీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో అలరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే పోస్టర్‌ను వదిలారు. ఇందులో ప్రభాస్ ని అల్ట్రా స్టైలిష్ లుక్‌తో హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా విడుదలైన ‘ది రాజా సాబ్’ పోస్టర్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని అభిమానించే వాళ్లంతా ఇది ‘మిర్చి’ లుక్ కంటే సూపర్‌గా ఉందని చెబుతుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం ఈ లుక్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు .

ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ను స్లిమ్‌గా, అందంగా చూపించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) టెక్నాలజీని అతిగా వాడారని కామెంట్లు చేస్తున్నారు. లుక్ విషయంలో కూడా టెక్నాలజీని గట్టిగా వాడినట్లు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఫొటోలో ప్రభాస్ లుక్ కూడా రియాలిటీకి తగ్గట్టుగా లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా AI టెక్నాలజీని రాజా సాబ్ కు గట్టిగా వాడుతున్నారనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

దీంతో రెబెల్ స్టార్ అభిమానులకు, యాంటి ఫ్యాన్స్‌కు మధ్య భీకరమైన మాటల యుద్ధం నడుస్తోంది. మొత్తానికి ప్రభాస్ లుక్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతుండగా.. ఈ ట్రోల్స్ కూడా హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి స్పెషల్ ట్రీట్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘అతడి రోజు.. అతడి క్షణం.. అతడి రాక. మీ అంచనాలకు మించేలా ఇది ఉండబోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. మరి పోస్టర్‌పై వచ్చిన మిక్స్‌డ్ టాక్‌ను ఈ వీడియో మరిపిస్తుందేమో చూడాలి.