ప్రభాస్ (X) రణబీర్ : ధూమ్ 4 ఛాన్స్ ఎవరికి?
అయితే యష్ రాజ్ ఫిలింస్ చాలా కాలంగా ఈ ఫ్రాంఛైజీలో నాలుగో భాగం తెరకెక్కించేందుకు ప్రయత్నాల్లోనే ఉంది.
By: Tupaki Desk | 28 Sep 2024 1:30 PM GMTయష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా 2025 చివరిలో భారతదేశపు అతిపెద్ద ఫ్రాంచైజీని రీబూట్ చేయబోతున్నారని సమాచారం. ఆయన దృష్టి ప్రస్తుతం ధూమ్ 4పై ఉందని తెలిసింది. ఇప్పటివరకూ భారతదేశంలో ధూమ్ ఫ్రాంఛైజీ అసాధారణ విజయాలతో రక్తి కట్టించింది. ధూమ్ లో జాన్ అబ్రహాం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ స్టార్లు నటించడంతో అవన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లకు కారణమయ్యాయి.
అయితే యష్ రాజ్ ఫిలింస్ చాలా కాలంగా ఈ ఫ్రాంఛైజీలో నాలుగో భాగం తెరకెక్కించేందుకు ప్రయత్నాల్లోనే ఉంది. రకరకాల కారణాలతో ఇది ఆలస్యమైంది. పరిశ్రమ అగ్ర హీరోలందరితో సినిమాలు తీస్తుండడం, భారీ మల్టీస్టారర్లతో 1000 కోట్ల క్లబ్ కలలతో ముందుకు సాగడంతో సదరు బ్యానర్ దారి తప్పింది. యష్ రాజ్ ఫిలింస్ కొన్ని వరుస డిజాస్టర్లతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంది.
నిజానికి ధూమ్ ఫ్రాంఛైజీ మొదలై ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తయింది. 2004లో సంజయ్ గాధ్వి దర్శకత్వం వహించిన `ధూమ్`లో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటించారు. ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులకు యాక్షన్ స్పేస్‌లో సరికథ వినోదాన్ని అందించింది. ఇది పూర్తిగా కొత్త నమూనాను పరిచయం చేసింది. రెండు సంవత్సరాల తర్వాత 2006లో ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్‌గా నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. 2013లో అమీర్ ఖాన్‌తో ఫ్రాంచైజీ మరింత పెద్దగా ఎదిగింది. ఆ తర్వాత ధూమ్ 4లో నటించే స్టార్ల గురించి చాలా ఊహాగానాలు సాగాయి.
ఇటీవల ధూమ్ ఫ్రాంఛైజీలో నాలుగో భాగం చిత్రీకరణ కోసం ఆదిత్య చోప్రా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ధూమ్ 4లో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. రణ్‌బీర్‌తో చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అతను ప్రాథమిక ఐడియాను వినడానికి ధూమ్ 4లో భాగం కావడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరిచాడు. ఎట్టకేలకు ఫ్రాంచైజీలో కీలక పాత్రకు లాక్ అయ్యాడని తెలుస్తోంది. ధూమ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రణబీర్ కపూర్ సరైన ఎంపిక అని ఆదిత్య చోప్రా భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే ఇంతకుముందు బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రభాస్ పైనా యష్ రాజ్ ఫిలింస్ ఆసక్తిగా ఉందని, ఈ ఫ్రాంఛైజీలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం అతడిని సంప్రదించిందని కూడా కథనాలొచ్చాయి. ధూమ్ 4లో ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తాడని కూడా టాక్ నడిచింది. అయితే ఇది ఇప్పట్లో వీలు పడదని గుసగస వినిపిస్తోంది.
ధూమ్4లో రణబీర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించేందుకు దాదాపుగా లాక్ అయ్యాడని చెబుతున్నారు. ఒరిజినల్ నుంచి ఇతర నటులు ఎవరూ తిరిగి నటంచే వీల్లేదని తెలుస్తోంది. ధూమ్ 4లో కాప్ బడ్డీల జంటగా నటించడానికి యువ తరానికి చెందిన ఇద్దరు పెద్ద హీరోలు వస్తారు. ఇప్పుడు కోర్ స్టోరీ బోర్డ్ లాక్ అయింది. టీమ్ కాస్టింగ్ ఎంపికల దశలో ఉంది. ధూమ్ 4 కేవలం అతిపెద్ద ధూమ్ చిత్రం మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా నుండి గ్లోబల్ స్టాండర్డ్ టెంట్‌పోల్ ఫీచర్ ఫిల్మ్ అవుతుందని, దీనికోసం 500కోట్లు పైగా ఖర్చు చేస్తారని సోర్స్ చెబుతోంది.
రణబీర్ కపూర్ లవ్ అండ్ వార్ , రామాయణం 1 , రామాయణం 2 షూటింగ్ లను పూర్తి చేసిన తర్వాత 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ధూమ్ 4ను సెట్స్ పైకి తీసుకురావాలని YRF ప్లాన్ చేస్తోంది. ఆసక్తికరంగా ధూమ్ 4 రణబీర్ కపూర్ కెరీర్‌లో 25వ చిత్రం. అతడు తన సిల్వర్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా ఉండాలని ఉత్సాహంగా ఉన్నాడు. అతను యానిమల్ పార్క్‌తో పాటు ధూమ్ 4 చిత్రీకరణలో పాల్గొనే వీలుందని తెలుస్తోంది. తద్వారా ఈ దశాబ్దంలో అసాధారణమైన లైనప్‌తో ముందుకు సాగుతున్న హీరోగా రికార్డులకెక్కుతాడని తెలుస్తోంది. దర్శకుడి విషయానికొస్తే 2025 మిడిల్ ఇయర్ నాటికి దర్శకుడు ఎవరు? అన్నది యష్ రాజ్ సంస్థ లాక్ చేస్తుంది. 2025-ఎండ్ లేదా 2026 ప్రారంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళతారు.
ధూమ్ ఫ్రాంచైజీ గురించి మాట్లాడితే మొదటి భాగం ఒక కల్ట్ క్లాసిక్ హిట్. నిర్మాతలు ధూమ్ 2, ధూమ్ 3 రూపంలో బ్లాక్‌బస్టర్, ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌లను సాధించారు. ధూమ్ 4తో అంతకుమించి నిరూపించాలని పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ధూమ్ ఫ్రాంఛైజీలో ప్రభాస్ లాంటి మ్యాకో హీరో నటిస్తే దాని రేంజు మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ యష్ రాజ్ ఫిలింస్ మైండ్ లో ఏం ఉందో ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. రణబీర్ కపూర్ ఎంపిక గురించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.