Begin typing your search above and press return to search.

స్క్రిప్ట్ క్రాఫ్ట్.. టాలెంటెడ్ రైటర్స్ కు ప్రభాస్ ఆహ్వానం!

ఎక్కువ మంది ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఒక వేదికగా మారుతుందని పేర్కొంటూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వెబ్ సైట్ వివరాలను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 9:49 AM GMT
స్క్రిప్ట్ క్రాఫ్ట్.. టాలెంటెడ్ రైటర్స్ కు ప్రభాస్ ఆహ్వానం!
X

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించడానికి రూపొందించబడిన 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే వెబ్‌సైట్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ప్రారంభించారు. రచయితలు వారి కథలను పంచుకోవడానికి, వారి ప్రతిభను చూపించడానికి, ఎక్కువ మంది ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఒక వేదికగా మారుతుందని పేర్కొంటూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వెబ్ సైట్ వివరాలను షేర్ చేశారు.

"మీ స్టోరీని షేర్ చేయండి, ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రపంచాన్ని ప్రేరేపించండి, ఇక్కడ రచయితలు వారి మాటలకు జీవం పోస్తారు మరియు వాస్తవికతను రూపొందించడానికి ప్రేక్షకులు ఓటు వేస్తారు. ఈ ఉద్యమంలో మీరూ చేరండి. 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' టీంకి నా శుభాకాంక్షలు!'' అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోని కూడా జత చేసారు. ఆరు భాషల్లో రూపొందించిన ఈ వీడియో రచయితల దృష్టిని ఆకర్షిస్తోంది.


''ఓ రైటర్ గా నువ్వు రాసుకున్న ఓ కథని ఈ ప్రపంచానికి చెప్పాలని అనుకుంటావ్. అవకాశం కోసం, కనిపించిన ప్రతీ తలుపును తడతావ్. అలసిపోకుండా ఎదురు చూస్తావ్. కానీ నీ కల నిజం అవ్వడం ఇంక కలే అని నీకు అనిపిస్తే.. నీ కథను ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తే, డైరెక్ట్ గా ప్రేక్షకులే నీ కలను నిజం చేస్తారు. నువ్వు.. నీ కథ.. నువ్వు ఎదురు చూస్తున్న అవకాశం'' అంటూ స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్ సైట్ గురించి ఈ వీడియోలో వివరించారు.

ఇందులో భాగంగా ''మీ ఫేవరేట్ హీరోకి సూపర్ సూపర్ పవర్స్‌తో ఊహించుకోండి!" అనే పేరుతో స్క్రిప్ట్ క్రాఫ్ట్ టీం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తోంది. అసాధారణమైన సామర్థ్యాలు కలిగిన సూపర్ హీరోని ఊహించుకుంటూ, 3,500 పదాలలో ఓ కథ రాసి వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని నిర్వాహకులు సూచించారు. ఆడియన్స్ ఓటింగ్, రేటింగ్స్ ఆధారంగా ఎంపికైన విన్నర్ కు.. రియల్ ప్రాజెక్ట్‌లో అసిస్టెంట్ రైటర్‌గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.

ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఉప్పలపాటి, తాళ్ల వైష్ణవ్ కలిసి 'స్క్రిప్ట్ క్రాఫ్ట్‌' ను స్థాపించారు. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ప్రభాస్ ఈ వెబ్ సైట్ ను ప్రమోట్ చేస్తున్నారు. రచయితలకు వారి కథా నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి, వారి క్రియేటివ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. అంతేకాదు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఆడియో బుక్స్ ఫీచర్‌ను కూడా పరిచయం చేయాలని చూస్తున్నారు.

స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఆడియో బుక్స్ ఫీచర్‌.. రచయితలు తమ కథలను ఆడియోల రూపంలో మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవల కాలంలో ఆడియో సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో.. ఈ కొత్త ఫీచర్ ఆడియో స్టోరీ టెల్లింగ్‌ని ఆస్వాదించే శ్రోతలను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ విధంగానూ స్టోరీలు ప్రేక్షకులకు చేరువవుతాయి. డిజిటల్ స్పేస్ లో ప్రతిభావంతులైన రచయితలకు అవకాశాలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఈ ప్రయత్నానికి తనవంతు మద్దతు తెలుపుతున్నారు.

సినీ రంగంలో అడుగుపెట్టడం, అవకాశాలు అందిపుచ్చుకోవడం ఏమంత సులభం కాదు. తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు, ఒక్క ఛాన్స్ దొరికితే చాలని ఎందరో ప్రతిభావంతులు ఎదురు చూస్తుంటారు. తమ కలలను నిజం చేసుకోవాలని ప్రయత్నించే రైటర్స్ కు అవకాశాలు అందించే ఒక వేదికగా 'స్క్రిప్ట్ క్రాఫ్ట్' ఉపయోగపడుతుందని భావించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీకూ సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనే ఆసక్తిగా ఉంటే, ఒక మంచి కథ రాసి ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యండి.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే సినిమాలో నటిస్తున్నారు. హను రాఘవపూడి సినిమాని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఏడాది చివర్లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' సినిమా మొదలు కానుంది. 'సలార్: పార్ట్ 2 - శౌర్యంగ పర్వం', 'కల్కి 2' సినిమాలు కూడా డార్లింగ్ లైనప్ లో ఉన్నాయి.